V6 News

అనాథ పిల్లలకు అండగా ఉంటాం : మంత్రి సీతక్క

అనాథ పిల్లలకు అండగా ఉంటాం : మంత్రి సీతక్క
  •     ఉన్నత విద్య, ఉపాధికి కావాల్సిన అన్ని సర్టిఫికెట్లు అందిస్తున్నం: మంత్రి సీతక్క
  •     1,055 మంది అనాథలకు ధ్రువీకరణ పత్రాల అందజేత 
  •     త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అందజేస్తామని వెల్లడి 
  •     డ్రగ్స్‌‌‌‌‌‌‌‌కు దూరంగా ఉండాలని సూచన 

హైదరాబాద్, వెలుగు: ఆఫ్టర్ కేర్ (సంరక్షణ కేంద్రాల నుంచి బయటకు వచ్చే) పిల్లలకు రాష్ట్ర సర్కార్ అండగా ఉంటుందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క భరోసానిచ్చారు. సోమవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన “చైల్డ్ సేఫ్టీ - ప్రొటెక్షన్ అండ్ సే నో టు డ్రగ్స్” కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని పోస్టర్​ను ఆవిష్కరించారు. 1055 మంది అనాథ విద్యార్థులకు కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆరోగ్యశ్రీ కార్డులను మంత్రి అందజేశారు. 

అనంతరం ఆమె మాట్లాడుతూ గతంలో అనాథ పిల్లలు సర్టిఫికేట్ల కోసం పడరాని పాట్లు పడేవారని, ఇప్పుడు ప్రభుత్వం నేరుగా అందజేస్తుందని చెప్పారు. ఈ సర్టిఫికేట్లు కేవలం కాగితాలు కావని, మీ భవిష్యత్తును మార్చే ఆయుధాలని పేర్కొన్నారు. చదువుకోవాలన్నా, ఉద్యోగం రావాలన్నా ఇవి ఎంతో అవసరమని, వీటిని జాగ్రత్తగా భద్రపర్చుకోవాలని సూచించారు.  సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. 

చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, డ్రగ్స్​కు బానిస అయ్యి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. క్రీడల్లోనూ రాణించాలని కోరుతూ ఈగల్ ఫోర్స్ ఇచ్చిన స్పోర్ట్స్ కిట్లను మంత్రి అందజేశారు. ప్రజా పాలన ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో బాలల హక్కుల కమిషన్ చైర్​పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, కలెక్టర్ ప్రియాంక అల, కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా, ఈగల్ ఫోర్స్ ప్రతినిధులు గిరిధర్, పద్మజ తదితరులు పాల్గొన్నారు. చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూషన్ల పిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.