
తొమ్మిదో క్లాసు వరకు స్టూడెంట్లపై సర్కారు యోచన
పరీక్షలపై ఇంకా వెలువడని స్పష్టత
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో క్లాసు వరకూ నిర్వహించాల్సిన పరీక్షలపై సర్కారు తర్జనభర్జన పడుతుంది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం నుంచి జరగాల్సిన వార్షిక (సమ్మెటివ్ అసెస్మెంట్–2) పరీక్షలు లాక్ డౌన్ నేపథ్యంలో వాయిదా పడ్డాయి. ఈ నెల 14 తర్వాతైనా వాటిని నిర్వహిస్తారా, లేక స్టూడెంట్లను నేరుగా పై తరగతులకు ప్రమోట్ చేస్తారా అన్న దానిపై ఇంకా ఎలాంటి స్పష్టతా రాలేదు. వాస్తవానికి స్కూల్ ఎడ్యుకేషన్ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం రాష్ట్రంలో ఈ నెల 7వ తేదీనుంచే ఒకటో క్లాసు నుంచి నైన్త్ క్లాస్ వరకు (ఎస్ఏ–2) పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో స్కూళ్లు మూతపడ్డాయి. టెన్త్ పరీక్షలకు సంబంధించి పదిహేను రోజుల కింద హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో.. మార్చి 23 నుంచి జరగాల్సిన ఆ పరీక్షలను సర్కారు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 7 నుంచి స్కూళ్లలో జరగాల్సిన వార్షిక పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్టు ఎస్సీఈఆర్టీ ప్రకటించింది. తర్వాత షెడ్యూల్ ప్రకటిస్తామని పేర్కొంది.
రెండు రకాల ప్రపోజల్స్
తొమ్మిదో క్లాసు వరకు వార్షిక పరీక్షల నిర్వహణపై సర్కారుకు విద్యాశాఖ రెండు రకాల ప్రతిపాదనలు పంపింది. కరోనా నేపథ్యంలో పరీక్షలు రద్దు చేసి స్టూడెంట్స్ ను నేరుగా పైతరగతులకు ప్రమోట్ చేయడం ఒకటికగా.. జూన్లో పరీక్షలు నిర్వహించడం రెండోది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో 9వ తరగతి వరకూ పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేశారు. సీబీఎస్ఈ కూడా పలు పరీక్షలను రద్దు చేసి స్టూడెంట్స్ అందరినీ ప్రమోట్ చేసింది. ఈ లెక్కన తెలంగాణలోనూ అదే తరహా నిర్ణయం తీసుకునే అవకాశముందని అధికారులు చెప్తున్నారు. కానీ మన సర్కారు మాత్రం ఇంకా
అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయకపోవడంతో స్టూడెంట్స్, పేరెంట్స్ఆందోళన చెందుతున్నారు. స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.
For More News..