- సుమారు 9 వేల మందికి ప్రయోజనం: వీపీ గౌతమ్
హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి రాష్ట్రంతో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ ఇండ్ల నిర్మాణం ప్రారంభించి, బేస్‌మెంట్ మాత్రమే కట్టి వదిలేసిన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారందరికీ ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కింద ఇండ్లు సాంక్షన్ చేస్తూ హౌసింగ్ శాఖ స్పెషల్ సెక్రటరీ వీపీ గౌతమ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
గతేడాది మార్చిలో ఇచ్చిన ఉత్తర్వుల్లో సవరణ చేసినట్టు గౌతమ్ తెలిపారు. ఇందిరమ్మ స్కీమ్‌లో ఉన్నట్లుగానే ఈ ఇండ్లను కూడా 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోనే నిర్మించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా లబ్ధిదారులు సుమారు 9 వేల మంది ఉన్నట్లు అధికారుల సర్వేలో వెల్లడైంది. బేస్‌మెంట్ నిర్మాణానికి ఇప్పటికే ప్రభుత్వం రూ.1 లక్ష సాయం అందించింది. మిగిలిన రూ.4 లక్షల సాయాన్ని ఇప్పుడు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
