‘ఇందిరమ్మ బీమా’కు ఇంటింటి సర్వే!

‘ఇందిరమ్మ బీమా’కు ఇంటింటి సర్వే!
  • పూర్తైన ఇండ్లకు లోగో స్టిక్కర్లు
  • జూన్ 2 నుంచి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక
  • కేబినెట్ సబ్ కమిటీ భేటీలో నిర్ణయం

హైదరాబాద్​, వెలుగు : రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవితం బీమా’ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరికీ వర్తింపజేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. మంగళవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కూడిన కమిటీ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇల్లు కవర్ అయ్యేలా సమగ్ర గృహ స్థాయి డేటా సేకరణ జరపాలని, ఒకవేళ ఎవరైనా మిగిలిపోతే వారి కోసం స్పెషల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులను కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. ఈ బీమా పథకానికి ఒక విశిష్టమైన ‘లోగో’ను రూపకల్పన చేయనున్నట్లు, సర్వే పూర్తైన ప్రతి ఇంటికి ఈ లోగోతో కూడిన స్టిక్కర్లను అతికించనున్నట్లు మంత్రులు వెల్లడించారు. ఈ మేరకు అన్ని శాఖలు తమ సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను వెంటనే సిద్ధం చేసి సమర్పించాలని సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. ఈ సమావేశంలో డీజీపీ సి.వి ఆనంద్, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు జయేశ్​రంజన్, వికాస్ రాజు, దాన కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

జూన్ 2 నుంచి 12 వరకు ప్రత్యేక కార్యక్రమాలు..

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2 నుంచి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని కేబినెట్ సబ్ కమిటీ అధికారులను ఆదేశించింది.  ముఖ్యంగా పర్యావరణ వారోత్సవం, రోడ్డు భద్రత, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం, మహిళా-శిశు రక్షణ, గృహ నిర్మాణం, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలను నిర్వహించాలని నిర్దేశించారు.