చేపల వంటకాలతో.. హైదరాబాద్ లో ఫుడ్ ఫెస్టివల్

చేపల వంటకాలతో..  హైదరాబాద్ లో ఫుడ్ ఫెస్టివల్

తెలంగాణ రాష్ట్ర పదో వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా జూన్ 8వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించాలని మత్స్యశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో దీన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో 20 నుంచి 30 రకాల చేపల వంటకాలను ప్రదర్శించనున్నారు. 

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌  మే 17 బుధవారం రోజున సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహణ, ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో చర్చించారు. ఫెస్టివల్ నిర్వహణకు అనువైన ప్రాంతాలు గుర్తించి ఏర్పాట్లు చేయాలని అధికారులను తలసాని ఆదేశించారు.  

ఈ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ లో చేపలతో తయారు చేసిన ఫిష్ ఫ్రై, కర్రీ, బిర్యానీవంటి అన్ని రకాల వంటకాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా మత్స్యరంగానికి విశేష సేవలు అందించిన వారిని గుర్తించి సన్మానించాలని తెలిపారు.

మృగశిర కార్తీక మాసం ప్రారంభం రోజున ఈ  ఫిష్​ ఫుడ్​ ఫెస్టివల్​ను ప్రారంభించనున్నట్లుగా మంత్రి తెలిపారు.   కాగా  రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కొర్రమీను చేపను తెలంగాణ రాష్ట్ర చేపగా ప్రభుత్వం గుర్తించింది.