ప్రభుత్వ లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు

V6 Velugu Posted on Dec 04, 2021

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో జరపాలని  తెలంగాణ సర్కార్ నిర్ణయించింది.ఈ మేరకు రంగారెడ్డి , హైదరాబాద్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా రోశయ్య మృతి పట్ల ప్రభుత్వంమూడు రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని నిర్ణయించింది. రోశయ్య ఇవాళ ఉదయమే కన్నుమూశారు. ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. నిద్రలోనే రోశయ్య తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. మరోవైపు  ఆయన పార్థివదేహాన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లారు. రేపు గంట పాటు  గాంధీ భవన్ లో ప్రజల సందర్శనార్థం రోశయ్య భౌతికకాయాన్ని ఉంచనున్నారు. అనంతరం మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

మరోవైపు రోశయ్య మృతికి పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేస్తున్నారు. కొణిజేటి రోశయ్య మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  సంతాపం వ్యక్తం చేశారు. ఆర్ధిక శాఖ మంత్రిగా పలు పదవులకు వన్నె తెచ్చిన రోశయ్య, సౌమ్యుడిగా, సహన శీలిగా, రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించేవారు అని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

Tagged CM KCR, Telangana Govt, rosaiah funerals, rosaiah final rites

Latest Videos

Subscribe Now

More News