
- మద్దతు ధర రూ.2,400 చెల్లించాలని నిర్ణయం
- వానాకాలంలో 6.40 లక్షల ఎకరాల్లో మక్కల సాగు
- 11 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా
హైదరాబాద్, వెలుగు: వానాకాలంలో సాగైన మక్కలను గురువారం నుంచి కొనుగోలు చేసేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ఈ సీజన్లో మొక్కజొన్న పంట మార్కెట్‌కు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ను నోడల్ ఏజెన్సీగా నియమించి మక్కల కొనుగోళ్ల బాధ్యతలు అప్పగించింది. మార్క్ఫెడ్ అధికారులు కొనుగోళ్లపై కసరత్తు పూర్తి చేసి, ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసి మద్దతు ధరతో మక్కలు కొనేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
రైతులు తక్కువ ధరకు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకొని నష్టపోకుండా సర్కారు రంగంలోకి దిగింది. మార్కెట్‌కు దిగుబడి రావడం ప్రారంభం కాగానే, అందుకు అనుగుణంగా జిల్లాల వారీగా సెంటర్లను ప్రారంభించనున్నారు. క్వింటాల్‌కు రూ.2,400 చొప్పున మద్దతు ధరతో కొనుగోలు చేయనున్నారు.
6 లక్షల టన్నులు కొనుగోలుకు ఏర్పాట్లు..
ఈ వానాకాలంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా 6.44 లక్షల ఎకరాల్లో మక్కలు సాగు చేసి రాష్ట్ర రైతులు రికార్డు సృష్టించారు. వానాకాలం మక్కల సాధారణ సాగు విస్తీర్ణం 5.21లక్షల ఎకరాలు కాగా, నిరుడు ఇదే టైమ్‌కు 5.23లక్షల ఎకరాల్లో సాగైంది. కాగా, ఈ ఏడాది నిరుటి కంటే 1.23 లక్షల ఎకరాలకు పైగా మక్కలు సాగైనట్లు వ్యవసాయశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన నివేదికలో పేర్కొంది. మక్కల సాగులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 96,882 ఎకరాలతో టాప్‌లో ఉండగా, ఆ తరువాత రంగారెడ్డి జిల్లాలో 68,654 ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 62,566 ఎకరాల్లో సాగైంది.
నాగర్ కర్నూల్ జిల్లాలో 56,906 ఎకరాల్లో, నిజామాబాద్ జిల్లాలో 52,093 ఎకరాల్లో, కామారెడ్డి జిల్లాలో 50,728 ఎకరాల్లో సాగైనట్లు అధికారిక నివేదికలో పేర్కొన్నారు. వానాకాలం సీజన్లో 11లక్షల టన్నులు మార్కెట్‌కు వస్తుందని అంచనా వేశారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో నిర్వహించే కొనుగోలు సెంటర్లకు 5 నుంచి 6 లక్షల టన్నుల మక్కలు వస్తాయని మార్క్ ఫెడ్ అధికారులు అంచనా వేస్తున్నారు.
చేతికి వస్తున్న మక్క పంట..
ముందస్తుగా పంట సాగు చేసిన కొన్ని ప్రాంతాల్లో ఇప్పుటికే మక్కలు మార్కెట్‌కు వస్తుండగా, ఇంకొన్ని జిల్లాల్లో చివరి దశలో ఉంది. మరికొన్ని జిల్లాల్లో పంట కోసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మార్కెట్‌కు వస్తున్న మక్కలకు బహిరంగ మార్కెట్లో మద్దతు ధర కంటే తక్కువగా చెల్లిస్తున్నారు. ఈక్రమంలో ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోళ్లకు సమాయత్తమైంది.
200 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం..
మార్కెట్‌కు మక్కలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం నుంచి మక్కల కొనుగోళ్లు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 200 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. -శ్రీనివాస్‌రెడ్డి, ఎండీ, మార్క్ఫెడ్