- ఎంక్వైరీ చేపట్టాలని కోరుతూ సీబీఐకి లేఖ రాయండి
- సీబీఐ డైరెక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకొని నేరుగా కలిసి వినతిపత్రం ఇవ్వండి
- అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. న్యాయ నిపుణుల సూచనల మేరకు ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై తక్షణమే విచారణ చేపట్టాలని కోరుతూ సీబీఐకి లేఖ రాయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అవసరమైతే సీబీఐ డైరెక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకుని, నేరుగా కలిసి వినతిపత్రం సమర్పించాలని మంత్రులకు సూచించారు. కాళేశ్వరంపై ఇటీవల హైకోర్టు తీర్పు నేపథ్యంలో తదుపరి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో కలిసి సీఎం రేవంత్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయ నిపుణుడు అభిషేక్ సింఘ్వీతో చర్చించి ప్రభుత్వం అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికను నిర్దేశించారు.
హైకోర్టు పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటును, కమిషన్ ఇచ్చిన నివేదికను తప్పు పట్టలేదని, అవన్నీ చెల్లుబాటులో ఉన్నాయని న్యాయ నిపుణులు వివరించారు. కాళేశ్వరం అంశంపై ప్రస్తుతం ఏ కోర్టులోనూ ఎలాంటి కేసు పెండింగ్‌లో లేదని స్పష్టం చేశారు. అందువల్ల సీబీఐ విచారణ చేపట్టేందుకు చట్టపరమైన అడ్డంకులు లేవని అభిప్రాయపడ్డారు. మంత్రి శ్రీధర్‌బాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు , సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, ఇరిగేషన్ ఈఎన్సీ శ్రీధర్, సలహాదారు ఆదిత్య నాథ్ దాస్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

