
- నర్సరీ నుంచి ఇంటర్ వరకూ క్లాసులు
- ప్రతి మండలంలో 4 ఫౌండేషన్ స్కూళ్లు
- నర్సరీ నుంచి సెకండ్ క్లాస్ వరకూ తరగతులు
- ఆయా బడులకు గ్రామాల నుంచి బస్సు సౌకర్యం
- స్కూల్ పిల్లలకు బ్రేక్ ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్
- ఒకే ప్రాంగణంలోని విద్యాసంస్థలన్నీ విలీనం
- సర్కారుకు తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రతి మండలంలో 3 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, మరో 4 తెలంగాణ ఫౌండేషన్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని విద్యా కమిషన్ సిఫార్సు చేసింది. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రతి మండలంలో 2 రకాల స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని విద్యా కమిషన్ చైర్మన్, మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి నేతృత్వంలోని కమిషన్ టీమ్కలిసింది. ఈ సందర్భంగా సర్కారు స్కూళ్ల బలోపేతానికి కమిషన్ ప్రతిపాదించిన సిఫార్సులను అందించింది.
దీనిపైసీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్టు కమిషన్ ప్రతినిధులు చెప్పారు. ప్రతి మండలంలో ప్రస్తుతం ఉన్న బడులతోపాటు తెలంగాణ పబ్లిక్ హై స్కూళ్లు (టీపీఎస్), తెలంగాణ ఫౌండేషన్ స్కూళ్లు (టీఎఫ్ఎస్) ఉండాలని సర్కారుకు ఇచ్చిన నివేదికలో కమిషన్ పేర్కొన్నది. దీనికి కావాల్సిన నిధులు, వాటిల్లో ఏఏ ఫెసిలిటీస్ కల్పించాలనే దానిపై సమగ్రంగా దాంట్లో వివరించింది. ప్రధానంగా ఈ 2 రకాల బడుల్లో చదివే పిల్లలకు ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్ అందించాలని నివేదికలో పేర్కొన్నది. ప్రస్తుతం ఉన్న బడులనే బలోపేతం చేస్తూ వీటిని ఏర్పాటు చేయాలని కమిషన్ ప్రతిపాదించింది. గ్రామాల నుంచి ఆయా స్కూళ్లకు పిల్లలను తరలించేందుకు సుమారు 20 పెద్ద బస్సులు, 35 మినీ బస్సులు అవసరమని తెలిపింది. వీటిని 6 విడతల్లో అమలు చేయాలని సూచించింది. తొలివిడత 2025–26 విద్యా సంవత్సరంలో ప్రతి సెగ్మెంట్ కు ఒక మండలం చొప్పున 100 మండలాల్లో ప్రారంభించాలని ప్రతిపాదన చేసింది. వీటి ద్వారా ప్రస్తుతం ఉన్న ఏ ఒక్క స్కూల్ కూడా మూసివేయబోరని తెలిపింది. అయితే, విద్యాకమిషన్ చేసిన సిఫార్సుల అమలు సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలిసింది.
3 పబ్లిక్ స్కూళ్లు ఇలా..
విద్యా కమిషన్ సిఫార్సుల ప్రకారం.. ఒక్కో తెలంగాణ పబ్లిక్ స్కూల్లో 1,500 నుంచి 1,800 మంది వరకూ విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవచ్చు. వీటిలో ప్రీ ప్రైమరీ లెవెల్ నుంచి ఇంటర్మీడియెట్ వరకు క్లాసులు నిర్వహించనున్నారు. కనీసం 4 –5 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. ప్రతి సెక్షన్లో 30 మందికి మించి స్టూడెంట్లు ఉండొద్దు. 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టూడెంట్లకు కెరీర్ గైడెన్స్ ఇవ్వనున్నారు. ఒక్కో స్కూల్ ఏర్పాటుకు 12 కోట్లు అవసరం. మొత్తం 632 స్కూళ్లకుగానూ రూ. 22 వేల కోట్లు కావాలని సర్కారుకు అందించిన నివేదికలో విద్యా కమిషన్ తెలిపింది.
ఫౌండేషన్ స్కూల్స్ ఇలా..
ప్రీ ప్రైమరీ లెవెల్ నుంచే స్కిల్ ఎడ్యుకేషన్ కోసం ప్రతి మండలంలో 4 తెలంగాణ ఫౌండేషన్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని విద్యా కమిషన్ సిఫార్సు చేసింది. ఒక్కో స్కూల్లో 250 మంది వరకు పిల్లలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. దీంట్లో నర్సరీ, ఎల్ కేజీ, యూకేజీ, ఒకటి, రెండు తరగతులు ఉంటాయి. వీటిలో క్వాలిఫైడ్ ప్రైమరీ టీచర్లను ఏర్పాటు చేయడంతోపాటు ఆ బడుల్లో ఆటస్థలం, అక్కడే నిద్రపోయేందుకు ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేయాలి. వీటిలో ఏఐ ల్యాబులూ ఉండాలి. ఒక్కో స్కూల్ ఏర్పాటుకు సుమారు 3.5 కోట్లు అవసరం అవుతాయని కమిషన్ అంచనా వేసింది. దీని ఏర్పాటుకు కనీసం అర ఎకరం స్థలమైనా ఉండాలని నివేదికలో పేర్కొన్నది.
కమిషన్ మరిన్ని సిఫార్సులు ఇవే..
-
ఒకే ప్రాంగణంలో ఉన్న ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్లతోపాటు ఇంటర్ కాలేజీలు ఉంటే.. వాటన్నింటినీ విలీనం చేసి, ఒకే స్కూల్ చేయాలి. దీనిద్వారా ప్లేగ్రౌండ్, క్లాసు రూమ్స్ కొరత తీరుతుంది.
-
పేరెంట్స్ ఆలోచనలకు అనుగుణంగా అన్ని టీపీఎస్, టీఎఫ్ఎస్ లలో ఇంగ్లిష్ మీడియంలోనే క్లాసులను బోధించాలి.
-
టీపీఎస్, టీఎఫ్ఎస్లలో ఒకటో తరగతిలో అడ్మిషన్ కోసం ఆరేండ్ల వయస్సు తప్పనిసరి.
-
టీపీఎస్ లకు రూ.20 లక్షలు, టీఎఫ్ఎస్ లకు రూ.5 లక్షల నిర్వహణ నిధులు ఏటా ఇవ్వాలి.
-
తెలంగాణ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ (టీఎస్ఎస్ఏ) ఏర్పాటుతో పాటు థర్డ్ పార్టీ ద్వారా అసెస్ మెంట్స్ నిర్వహించాలి.