
- ఇప్పటికే ఆరు జిల్లాల్లో వడ్ల కేంద్రాలు ప్రారంభం
- మొత్తం 80 లక్షల టన్నులు కొనాలని టార్గెట్
- ఇయ్యాల్టి నుంచి మక్కల కొనుగోళ్లు
- 6 లక్షల టన్నులు కొననున్న మార్క్‌ఫెడ్
హైదరాబాద్, వెలుగు: వానాకాలం సీజన్ పంటల కొనుగోళ్లకు సర్కార్ సిద్ధమైంది. ఇప్పటికే వడ్ల కొనుగోళ్ల కోసం ఆరు జిల్లాల్లోని ధాన్యం సేకరణ కేంద్రాల్లో రైతుల వివరాలను నమోదు చేసుకుంటున్నది. అలాగే గురువారం నుంచి మక్కలు కొనడానికి కూడా సిద్ధమైంది. మరోవైపు ఈ నెల 21నుంచి సీసీఐ ద్వారా పత్తి కూడా కొనడానికి లైన్ క్లియర్ అయింది. మొత్తంగా 80 లక్షల టన్నుల వడ్లు, 27 లక్షల టన్నుల పత్తి, 6 లక్షల టన్నులకు పైగా మక్కల కొనుగోళ్లకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
పత్తి కొనుగోళ్లకు లైన్ క్లియర్..
జిన్నింగ్ మిల్లులతో చర్చలు ఫలించడంతో సీసీఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 21 నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. మన రాష్ట్రంలో 45 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా, 27 లక్షల టన్నులు ఉత్పత్తి అయ్యిందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్టు 328 జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోళ్లు ప్రారంభించనున్నారు. జాబ్ వర్క్ టెండర్లలో మిల్లర్లు పాల్గొనకపోవడంతో ఆలస్యమైనప్పటికీ..మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చర్చల ఫలితంగా సమస్యలు తొలిగాయి.
అయితే ‘కపాస్ కిసాన్’ యాప్‌లో నమోదు చేసుకున్న రైతుల నుంచే కొనుగోళ్లు చేయనున్నారు. ఈ నెల1 నుంచి నిజామాబాద్, కామారెడ్డి, నల్గొండ, సిరిసిల్ల, భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లో వడ్ల కొనుగోళ్లు షురూ అయ్యాయి. ఈ సీజన్‌లో 68 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, కోటిన్నర లక్షల టన్నుల ధాన్యం పండిందని.. ఈ లెక్కన 80 లక్షల టన్నుల వరకు వడ్లు కొనాల్సి వస్తుందని అధికారులు అంచనా వేశారు.
ఇందుకోసం ప్రభుత్వం రూ.21,112 కోట్లు కేటాయించింది. సన్నొడ్లకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్‌కూడా ఇవ్వనున్నారు. మరో 15 రోజుల్లో వడ్ల సేకరణ వేగవంతమవుతుందని, కొనుగోళ్లు కేంద్రాల్లో కావాల్సిన పరికరాలను సిద్ధం చేస్తున్నామని అధికారులు తెలిపారు.
ప్రభుత్వ కేంద్రాల వైపు మక్క రైతులు
రాష్ట్రంలో ఈ వానాకాలంలో రైతులు 6.44 లక్షల ఎకరాల్లో మక్క సాగు చేశారు. ఈ పంట సెప్టెంబర్మూడో వారం నుంచే మార్కెట్‌లోకి వచ్చింది. దీంతో గురువారం నుంచి మార్క్‌ఫెడ్ కొనుగోళ్లకు శ్రీకారం చుట్టనుంది. కనీస మద్దతు ధర రూ.2,400 ఉండగా.. మార్కెట్ ధర రూ.1,800– -2,000 మాత్రమే ఉంది. దీంతో మక్క రైతులంతా సర్కారు కేంద్రాల వైపు పయనమవుతున్నారు. ఈ క్రమంలో 6 లక్షల టన్నుల మక్కలను కొనుగోలు చేసేందుకు మార్క్ఫెడ్సిద్ధమైంది.