హైదరాబాద్, వెలుగు: భాగ్యనగర గడ్డపై ఎఫ్ఐహెచ్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ టోర్నమెంట్‌లో ఇండియా అమ్మాయిలు అదరగొడుతున్నారు. స్టార్ స్ట్రయికర్ నవనీత్ కౌర్ (29వ, 34వ, 55వ నిమిషాల్లో) హ్యాట్రిక్ గోల్స్‌తో విజృంభించడంతో గచ్చిబౌలి హాకీ స్టేడియంలో బుధవారం జరిగిన పూల్–బి చివరి మ్యాచ్‌లో ఆతిథ్య ఇండియా 4–1 తేడాతో వేల్స్‌పై ఘనవిజయం సాధించింది. మొత్తం ఏడు పాయింట్లతో గ్రూప్‌లో టాప్ ప్లేస్‌తో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.
వరల్డ్ కప్ బెర్తుకు ఒక్క విజయం దూరంలో నిలిచింది. ఈ పోరులో పూర్తి ఆధిపత్యం చెలాయించిన ఇండియా 55 శాతం బాల్‌ను తన వద్దే ఉంచుకుని వేల్స్ డిఫెన్స్‌లోకి చొచ్చుకెళ్లి దాడులు చేసింది. ఆట ప్రారంభమైన 7వ నిమిషంలోనే కెప్టెన్ సలీమా టెటె అందించిన పాస్‌ను సాక్షి రాణా రివర్స్ హిట్ ద్వారా గోల్‌గా మలిచి ఇండియాకు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో క్వార్టర్ 29వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను నవనీత్ గోల్‌గా మార్చి స్కోరును 2–0కు పెంచింది.
మూడో క్వార్టర్‌లో నవనీత్ మరో గోల్ కొట్టడంతో ఆధిక్యం 3–0కు పెరిగింది. అయితే 39వ నిమిషంలో వేల్స్ ప్లేయర్ బెట్సన్ థామస్ గోల్ సాధించి తమ జట్టును రేసులోకి తెచ్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. కాసేపటికే వేల్స్ కెప్టెన్ ఎలిజబెత్ బింగ్‌హామ్ పెనాల్టీ స్ట్రోక్‌ను వృథా చేయగా, ఆట చివర్లో లభించిన మరో పెనాల్టీ స్ట్రోక్‌ను నవనీత్ గోల్‌గా మలిచి హ్యాట్రిక్ పూర్తి చేయడంతో ఇండియా ఘన విజయం సొంతం చేసుకుంది. ఆమెకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. శుక్రవారం జరిగే సెమీస్‌లో ఇటలీతో ఇండియా తలపడనుంది.
