చెన్నూరులో రూ.45 కోట్లతో కొత్త తాగునీటి పథకం: మంత్రి వివేక్ వెంకటస్వామి

చెన్నూరులో రూ.45 కోట్లతో  కొత్త తాగునీటి పథకం: మంత్రి వివేక్ వెంకటస్వామి

కోల్​బెల్ట్/జైపూర్,​ వెలుగు: చెన్నూరు పట్టణంలో రానున్న 15 ఏళ్ల కాలంలో నీటి ఎద్దడి తలెత్తకుండా రూ.45 కోట్లతో కొత్తగా గోదావరి నీటి పథకం ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశామని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి తెలిపారు. బుధవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు, జైపూర్​ మండలాల్లో కలెక్టర్  కుమార్​ దీపక్​తో కలిసి పర్యటించారు. రంజాన్​ సందర్భంగా ముస్లింలకు తోఫా అందజేశారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా పోలీసులు నిర్వహించిన డ్రగ్స్​ రహిత తెలంగాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్​ హయాంలో రూ.60 వేల కోట్లతో ప్రారంభించిన మిషన్​ భగీరథతో చుక్క నీరు రాలేదన్నారు. చెన్నూరు మున్సిపాలిటీలో ఇంటింటికీ నల్లా నీళ్లు అందించేందుకు రూ.30 కోట్లతో అమృత్​ స్కీం డ్రింకింగ్  వాటర్​ స్కీం పనులు చేపట్టామన్నారు. పట్టణంలోని అంబేద్కర్  చౌరస్తా నుంచి చెరువు కట్ట వరకు రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయే వారికి కొత్త షాపింగ్  కాంప్లెక్స్  నిర్మించి,  రూమ్స్​ కేటాయిస్తామని హామీ ఇచ్చారు. చెన్నూరులో బస్​డిపో కు కేటాయించిన స్థలం వివాదంలో ఉందని, సమస్య పరిష్కరించి డిపో ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. జైపూర్​ మండలానికి 753 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామన్నారు. తాను చదువుకుంటున్న సమయంలో నాన్నతో పాటు ఆయన స్నేహితులకు కూడా చాయ్​ పెట్టి ఇచ్చేవాడినని, కప్పు సాసర్లు కూడా కడిగేవాడినని మంత్రి తెలిపారు. ఏ పనైనా ఇష్టంతో చేసేందుకు బాధ్యత తీసుకోవాలని సూచించారు. 

కాంగ్రెస్ లో చేరిన సర్పంచ్, వార్డు సభ్యులు

మంత్రి వివేక్​ వెంకటస్వామి సమక్షంలో మందమర్రి మండలం ఆదిల్​పేట సర్పంచ్​ నెండుగూరి పున్నం, ఉప సర్పంచ్​ కొట్రంగి రాజన్న, వార్డు సభ్యులు కటికల లక్ష్మి, ఆదె రాధ, టక్కెర రాజు, నెండుగూరి శ్యామల తదితరులు కాంగ్రెస్​లో చేరారు. మంచిర్యాలలోని మంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టుల జిల్లా మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్  కార్యకర్తల ఇండ్లలో జరిగిన వేడుకలకు హాజరయ్యారు. జైపూర్​ మండలం ఇందారంలో మంత్రికి ఆశా వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందించారు. మేనిఫెస్టోలో ఉన్న హామీలపై అసెంబ్లీ లో చర్చించి  అమలు చేయాలని, ఉద్యోగ భద్రత  కల్పించాలని కోరారు. ఆశా వర్కర్ల సమస్యలపై అసెంబ్లీ లో చర్చిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.