
కాబూల్/ఇస్లామాబాద్: పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ బార్డర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాలిబాన్లపై పాకిస్తాన్ ఆర్మీ బాంబుల వర్షం కురిపించింది. ప్రతీకారంగా అఫ్గానిస్తాన్ తాలిబాన్లు.. పాకిస్తాన్ ఆర్మీ ఔట్ పోస్టులపై డ్రోన్ బాంబులతో దాడి చేశారు. పీవోకేలోని బలూచిస్తాన్ ప్రావిన్స్ స్పిన్ బోల్డక్ ఏరియాలో మంగళవారం అర్ధరాత్రి ప్రారంభమైన దాడులు.. బుధవారం ఉదయం వరకు కొనసాగాయి. సుమారు 30 మంది తాలిబాన్లను హతమార్చినట్లు పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది.
పాకిస్తాన్– అఫ్గానిస్తాన్ ఫ్రెండ్షిప్ గేటును తాలిబాన్లు ధ్వంసం చేసినట్లు వివరించారు. అకారణంగా తమపై పాక్ ఆర్మీ దాడులు చేసిందని, తాము దీటుగా బదులిచ్చామని తాలిబాన్లు వెల్లడించారు. 58 పాకిస్తానీ సోల్జర్లను మట్టుబెట్టినట్లు తెలిపారు. ఖైబర్ పఖ్తుంఖ్వా కుర్రామ్ సెక్టార్‌లోని బార్డర్ ఔట్ పోస్టులపై తాలిబాన్లు, టీటీపీ కలిసి దాడికి ప్రయత్నించగా.. పాక్ ఆర్మీ అడ్డుకున్నది.
అఫ్గానిస్తాన్ తాలిబాన్లు ఏమంటున్నరు..?
పాకిస్తాన్ ఆర్మీ రెచ్చగొడ్తున్నదని తాలిబాన్లు ప్రకటించారు. స్పిన్ బోల్డక్‌లో పాక్ ఆర్మీ జరిపిన దాడుల్లో 12మంది పౌరులు చనిపోయారని, 100 మంది గాయపడ్డారని వివరించారు. అఫ్గానిస్తాన్‌లోని కాందహార్ ప్రావిన్స్, పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ రీజియన్ మధ్యలో స్పిన్ బోల్డక్ ఉంటుంది.
పాకిస్తాన్ ఏమంటున్నది?
ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే అఫ్గానిస్తాన్ సైన్యం దాడులకు పాల్పడిందని పాక్ ఆర్మీ అధికారులు ఆరోపించారు. అఫ్గానిస్తాన్ దాడులకు తాము ప్రతిదాడులు చేశామని, దాని ట్యాంకులను, సైనిక పోస్ట్‌లను ధ్వంసం చేశామని పేర్కొన్నారు. కాగా, ఒరాక్జాయ్లోని ఘిల్జో ఏరియాలో ఉన్న మహమూద్జాయ్ పోస్టుపై పాకిస్తాన్ తాలిబాన్లు దాడి చేశారు.
ఈ ఘటనలో ఫ్రాంటియర్ కోర్ (ఎఫ్‌సీ) కు చెందిన 8 మంది చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. కరాచీ శివారులో ఉన్న అఫ్గాన్ బస్తీ (గ్రామం)ని పాక్ అధికారులు కూల్చేశారు. ఈ నేపథ్యంలో జరిగిన తోపులాటలో అఫ్గాన్ శరణార్థులు గాయపడ్డారు. ఈ క్యాంప్‌లో సుమారు 8వేల మంది అఫ్గాన్లు ఉంటున్నారు.
48 గంటల సీజ్ ఫైర్‌కు పాక్–అఫ్గాన్ అంగీకారం
పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య 48 గంటల కాల్పుల విరమణ ఒప్పందం కుదరింది. బుధవారం ఉదయం జరిగిన దాడుల్లో ఇరువైపులా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో సాయంత్రం 6 నుంచి 48 గంటల పాటు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి. చర్చలతో ఎలాంటి సమస్య అయినా పరిష్కరించుకోవచ్చని పాకిస్తాన్ ప్రకటించింది.