- భూమిపై ఎక్కడైనా దాడి చేయగల సామర్థ్యం
- గంటకు 27 వేల కిలోమీటర్ల వేగం
- ఏకధాటిగా 13 వేల కిలోమీటర్లు ప్రయాణించే కెపాసిటీ
- ఒకేసారి మూడు స్వతంత్ర అణు వార్‌హెడ్‌లను తీసుకెళ్ల గల భారీ క్షిపణి
న్యూఢిల్లీ: ‘డూమ్స్‌డే మిసైల్’గా పిలిచే ‘మినిట్ మ్యాన్ 3’ అణ్వాయుధ సామర్థ్యం గల ఖండాంతర బాలిస్టిక్ మిసైల్(ఐసీబీఎం)ని అమెరికా పరీక్షించింది. ఈ మిసైల్ఏకదాటిగా 13 వేల కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. భూమిపై ఏ ప్లేస్నైనా టార్గెట్ చేయగల సామర్థ్యం దీనికి ఉంది. ఇరాన్‌తో యుద్ధం తీవ్రంగా కొనసాగుతున్న సమయంలో అమెరికా చేపట్టిన ఈ ప్రయోగం ఆందోళనను పెంచుతున్నది. అయితే ఈ పరీక్ష ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి కాదని, ఏండ్ల క్రితమే షెడ్యూల్ చేసిన సాధారణ పరీక్ష అని అమెరికా వెల్లడించింది. అమెరికా ఎయిర్ఫోర్స్ఆఫీసర్లు తెలిపిన వివరాల ప్రకారం.. కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి మినిట్ మ్యాన్- 3 మిసైల్‌ను మంగళవారం ప్రయోగించారు. దీనికి రెండు టెస్ట్ రీ-ఎంట్రీ వాహనాలను అమర్చారు. ఈ టెస్ట్ లో ప్రయోగించిన ఐసీబీఎంలోని రెండు రీ-ఎంట్రీ వాహనాలు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి మార్షల్ దీవుల్లోని క్వాజలేన్ అటోల్‌లో ముందుగా నిర్ణయించిన టార్గెట్‌ను చేరుకున్నాయి. మినిట్ మ్యాన్- 3ని గత ఏడాది నవంబర్‌లో కూడా అమెరికా ఒకసారి పరీక్షించింది.
‘డూమ్స్‌డే’ మిసైల్ ఎందుకు?
‘మినిట్ మ్యాన్ -3’ ఒక పవర్ ఫుల్అణు సామర్థ్యం కలిగిన క్షిపణి. దీనిలో మార్క్-21 హై ఫిడెలిటీ రీ-ఎంట్రీ వాహనం అమర్చబడి ఉంటుంది. ఈ క్షిపణి 13 వేల కిలోమీటర్ల దూరం వెళ్లి టార్గెట్‌ను కచ్చితత్వంతో పేల్చగలదు. ఈ క్షిపణి ఒకేసారి మూడు స్వతంత్ర అణు వార్‌హెడ్‌లను తీసుకెళ్లగలదు. అవి లక్ష్యానికి చేరుకునే ముందు వేర్వేరు దిశల్లో ప్రయాణించి దాడి చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. అయితే ప్రస్తుతం రష్యాతో ఉన్న అణు ఆయుధాల తగ్గింపు ఒప్పందం కారణంగా ప్రతి మినిట్ మ్యాన్- 3లో ఒక్క వార్‌హెడ్ మాత్రమే అమర్చుతున్నారు. దీని ద్వారా న్యూక్లియర్ దాడి చేస్తే భారీ రేడియేషన్ ప్రభావం వల్ల ఆ ప్రాంతం మనుషులు
నివసించలేని స్థితికి చేరే ప్రమాదం ఉంటుంది. అందుకే దీన్ని ‘డూమ్స్‌డే మిసైల్’ అని పిలుస్తారు.
గరిష్ట వేగం
సుమారు 27,000–29,000 కిలోమీటర్లు గంటకు (దాదాపు 7–7.5 కిమీ/సెకనుకు) ప్రయాణిస్తుంది. అమెరికా నుంచి దీన్ని ప్రయోగిస్తే 30 నిమిషాల లోపే మరో ఖండాన్ని చేరగలదు. అందుకే దీనిని ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ (ఏసీబీఎం) అంటారు.
టెస్ట్‌చేసే విధానం
భూమిలోని సైలోల నుంచి చేస్తారు. సైలో అంటే భూమిని లోతుగా తవ్వి చుట్టూ కాంక్రీట్, ఉక్కుతో బలంగా గోడలు తయారుచేస్తారు. మొత్తంగా లోతైన బంకర్అన్నమాట. ఇందులో మిసైల్‌ను నిలువుగా ఉంచి భద్రపరుస్తారు. పైభాగంలో భారీ ఉక్కు తలుపులు ఉంటాయి. శత్రు దాడుల నుంచి రక్షణ కోసమే దీన్ని లోతైన, స్ట్రాంగ్ బంకర్లో ఉంచుతారు.
ఎలా ప్రయోగిస్తారు?
అత్యవసర పరిస్థితుల్లో ఆదేశం వచ్చిన వెంటనే పైభాగంలోని భారీ తలుపులు తెరుచుకుంటాయి. క్షిపణి నేరుగా పైకి ఆకాశంలోకి లాంచ్ అవుతుంది. అమెరికాలో వందలాది మినిట్ మ్యాన్ 3 క్షిపణులు ఇలాంటి భూగర్భ సైలోల్లో నిల్వ చేసి ఉంచారని రక్షణ శాఖ నిపుణుల అభిప్రాయం.
