హైదరాబాద్, వెలుగు: ఆర్థిక శాఖ ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయని ఉద్యోగులు, తాత్కాలిక సిబ్బందికి అక్టోబర్ నెల జీతాన్ని నిలివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా శాఖల హెచ్ వోడీలకు సైతం శాలరీలు ఆపేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ సర్య్కులర్ మెమో ఇచ్చింది.
అన్ని శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు ఈ నెల 25 శనివారం అర్ధరాత్రిలోగా అందరి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని స్పష్టం చేసింది. రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌లాంటి ఏ కేటగిరీ ఉద్యోగికి అయినా ఆధార్ వివరాలు ఐఎఫ్ఐఎంఎస్ పోర్టల్ లో సమర్పించకపోతే జీతం చెల్లించబోమని స్పష్టం చేసింది. ఆర్థిక శాఖ దగ్గర ఉన్న లెక్కల ప్రకారం రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులు 5.21 లక్షలు, టెంపరరీ ఉద్యోగులు 4.93 లక్షల మంది ఉన్నారు.
అయితే గతంలోనే ఆన్లైన్ ఆధార్ వివరాలు అప్లోడ్ చేయాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ నెల 16 వరకు వివరాలు చూస్తే ఇందులో 2.75 లక్షల మంది వివరాలు అప్‌డేట్ అయ్యాయి. రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించి అలాగే ఉన్నది.
దీంతో ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర సర్కారు ఈ నెల 25లోగా ఉద్యోగులందరి ఆధార్ వివరాలు అప్‌డేట్ చేయాలని ఆదేశించింది. అందుకు సమయాన్ని పొడిగిస్తూ అవకాశం కల్పించింది. అయినప్పటికీ ఇంకా చాలా శాఖలు ఆధార్ అప్‌డేట్ చేయలేదు. శనివారం రాత్రి నాటికి టెంపరరీ ఉద్యోగులకు సంబంధించి 3.75 లక్షల మంది ఆధార్ వివరాలు నమోదు చేసినట్లు తెలిసింది.
