అర్హులందరికీ గృహ జ్యోతి పథకం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి ప్రకటన

అర్హులందరికీ గృహ జ్యోతి పథకం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి ప్రకటన

హైదరాబాద్, వెలుగు: పార్టీలకతీతంగా అర్హులందరికీ గృహజ్యోతి స్కీమ్​ను అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. పేద బడుగు బలహీన వర్గాలు ఆత్మగౌరవంతో తలెత్తుకొని జీవించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని.. అందులో భాగంగానే 200 యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం ద్వారా ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులోనూ ఈ పథకాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 

శనివారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో  సభ్యులు మధుసూదన్, నాగరాజు, కవ్వంపల్లి సత్యనారాయణ తదితరుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ స్కీమ్  కోసం కొత్త వారు ఎంపీడీవో కార్యాలయంలోని ప్రజా పాలన అధికారులను కలిసి దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈరోజు వరకు గృహ జ్యోతి లబ్ధిదారుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం రూ.3,593 వేల కోట్లు చెల్లించిందని తెలిపారు.  

ఇందిరమ్మ ఇండ్లు నిరంతర ప్రక్రియ: మంత్రి పొంగులేటి

రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద‌వారికి ఇందిర‌మ్మ ఇండ్ల మంజూరు ప్రక్రియ నిరంత‌రం కొనసాగుతుంద‌ని హౌసింగ్ మంత్రి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఒక విడ‌త ఇండ్లు మంజూరు చేశామ‌ని, మ‌రో మూడు విడ‌త‌లు ఈ కార్యక్రమం కొన‌సాగుతుంద‌న్నారు. ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థకం కింద ప్రతి సంవ‌త్సరం మార్చి-, ఏప్రిల్ నెల‌ల్లో ఇండ్లను మంజూరు చేస్తామ‌ని తెలిపారు. శ‌నివారం శాస‌న‌స‌భ‌లో ప‌లువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నల‌కు మంత్రి పొంగులేటి  స‌మాధానాలు ఇచ్చారు.   

చనాకా కొరాట ప్రాజెక్టును కీలకంగా తీసుకున్నం: మంత్రి ఉత్తమ్

చనాకా కొరాట  ప్రాజెక్టును ప్రభుత్వం కీలకంగా తీసుకుందని ఇరిగేషన్​ మంత్రి ఉత్తమ్​ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత సీఎం రేవంత్​రెడ్డి, తాను ఆదిలాబాద్ పర్యటనకు వచ్చి.. సబర్మత్ బ్యారేజ్ ను ప్రారంభిస్తామని తెలిపారు. అప్పుడే చనాకా కొరాట ప్రాజెక్టుపై చర్చిస్తామన్నారు. ఈ ప్రాజెక్టును ప్రభుత్వం కీలక అంశంగా తీసుకుందన్నారు.  ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు మంత్రి సమధాన మిచ్చారు.

రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం రైతు కమిషన్ ను ఏర్పాటు చేసిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌‌ రావు తెలిపారు. ఇప్పటికే పలు జిల్లాల్లో రైతు కమిషన్ పర్యటించి రైతులతో చర్చించిందని.. ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉందన్నారు. అసెంబ్లీ క్వశ్చన్ అవర్ లో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.