
- ఐరిస్ లేదా ఫింగర్ ప్రింట్స్‌తోనే భూములు, భవనాల క్రయ, విక్రయాలు
- కొత్త రెవెన్యూ యాక్ట్‌లో ‘ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ సిస్టం’కు రూపకల్పన
- సింగిల్ విండో విధానంలో కంక్లూజివ్ టైటిల్స్ జారీ
కొత్త రెవెన్యూ చట్టంతో ఆస్తి మార్పిడి మరింత సులభం కానుంది. రికార్డుల అప్‌డేషన్, కంప్యూటరైజ్డ్ డేటా బేస్ ఆధారంగా మ్యుటేషన్ ప్రాసెస్ నిమిషాల్లో పూర్తికానుంది. ఇందుకోసం సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్సు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పట్టణ/ పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్లలో భూములకు సంబంధించిన కార్యకలాపాలను ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చే దిశగా కసరత్తు చేస్తున్నారు. ఆయా శాఖల రికార్డులు ఒకేచోట కనిపించేలా అప్‌డేషన్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సిద్ధమవుతున్న ‘ధరణి’ వెబ్‌సైట్‌ను ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ సిస్టంగా అభివృద్ధి చేసి, పబ్లిక్ డొమైన్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. రికార్డుల అప్‌డేషన్‌తోపాటు నాలుగు విభాగాల కార్యకలాపాలనూ అధికారులు రీఇంజినీరింగ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
బయోమెట్రిక్ తప్పనిసరి
గతంలో రిజిస్ట్రేషన్‌కు ఒకటి నుంచి రెండు రోజులు, ఆర్వోఆర్ పాస్‌బుక్ జారీకి నెలలు పట్టేది. ఇదంతా ఎంతో కొంత ముట్టజెపితేనే అయ్యేది. ఒకరి సంతకం మరొకరు చేసి ఒకరి భూములను మరొకరి పేరిట పట్టా చేసిన ఘటనలు కోకొల్లలు. ఏళ్ల క్రితం అమ్మేసిన భూములు కూడా తమవేనని, అప్పుడు చేసిన సంతకాలు తమవి కావని తిరగబడిన కేసులూ అనేకం. ఇలాంటివి అటు అధికారులకు, ఇటు భూమి కొనుగోలు చేసినవారికి తలనొప్పిగా మారడంతో కొత్త రెవెన్యూ చట్టంలో ఈ సమస్యకు పరిష్కారం చూపాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా కంక్లూజివ్ టైటిల్స్ అమలులోకి వచ్చాక నిర్వహించే భూములు, భవనాల క్రయ, విక్రయాల్లో బయోమెట్రిక్ పద్ధతిని తప్పనిసరి చేయనున్నట్లు తెలిసింది. ఇందుకు ఐరిస్ లేదా ఫింగర్ ప్రింట్స్ పద్ధతిని అనుసరించాలని యోచిస్తున్నారు.
ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ వివరాలు ఆధార్ డేటాలో నమోదై ఉన్న దృష్ట్యా భూముల క్రయ, విక్రయాల్లో ఫోర్జరీకి ఆస్కారం ఉండబోదని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. ఐటీ యాక్ట్ –2000లోని సర్టిఫయింగ్ అథారిటీ నియమాలను అనుసరించి సురక్షితమైన ఫీచర్లతో ఈ ట్రాన్సక్షన్స్ నిర్వహించనున్నారు. కంక్లూజివ్ టైటిల్ హోల్డర్ ఒక వేళ చనిపోయినట్లయితే సదరు వ్యక్తి యాజమాన్య హక్కులను వారసులు ఎలా పొందాలనే విషయంలోనూ మార్గదర్శకాలను రూపొందిస్తున్నారు. కంక్లూజివ్ టైటిళ్లను జారీ చేసే సింగిల్ విండోలోని అధికారుల విధులు, బాధ్యతలు, క్రయ, విక్రయాలకు చెల్లించాల్సిన ఫీజులు, నియమ నిబంధనలను యాక్ట్‌లో పొందుపరచనున్నట్లు తెలిసింది.