సర్కార్ భూముల అర్రాస్

సర్కార్ భూముల అర్రాస్
  • 9 జిల్లాల్లో 1,408 ప్లాట్ల వేలం.. నోటిఫికేషన్ విడుదల
  • మార్చి 14 నుంచి 17 వరకు వేలంపాట 
  • రూ.2 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా 
  • ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల భూముల అమ్మకం 

హైదరాబాద్, వెలుగు: ఇన్నాళ్లు హెచ్ఎండీఏ పరిధిలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం... ఇక మీదట జిల్లాల్లోనూ చేయనుంది. సర్కార్ భూముల్లో వెంచర్లు వేసి, ప్లాట్లు విక్రయించనుంది. కొన్ని జిల్లాల్లో భూముల అమ్మకానికి ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. పథకాల అమలు, ఉద్యోగుల జీతాలు, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులకు నిధుల కొరత వేధిస్తుండడంతో మరోసారి ఆస్తుల అమ్మకానికి రెడీ అయ్యింది. గతంలో కోకాపేట, ఖానామెట్, ఉప్పల్ భగాయత్​లో ప్లాట్ల వేలం ద్వారా రూ.3,404 కోట్లు రాబట్టిన సర్కార్... ఇప్పుడు 9 జిల్లాల్లో ప్లాట్ల వేలం ద్వారా రూ.2 వేల కోట్లు రాబట్టుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. 
నాలుగు రోజులు వేలం
రంగారెడ్డి, మహబూబ్​నగర్, జోగులాంబ గద్వాల, నల్గొండ, కామారెడ్డి, పెద్దపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో 1,402 రెసిడెన్షియల్, 6 కమర్షియల్ కాంప్లెక్స్ ప్లాట్ల వేలానికి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 14, 15, 16, 17 తేదీల్లో వేలం నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది. ఈ నెల 18, మార్చి 7 తేదీల్లో ప్రీ బిడ్ సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.  
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్​ మండలంలో 240 ప్లాట్లు, నల్గొండ జిల్లా నార్కట్ పల్లిలో 240, జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో 202, రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​లో 313, శేరిలింగంపల్లిలో 3 (కమర్షియల్ కాంప్లెక్స్/ అపార్ట్ మెంట్), కామారెడ్డి జిల్లా కేంద్రంలో 230, పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలో 89, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో 71, వికారాబాద్ జిల్లా యాలాల్ మండలంలో 17, ఆదిలాబాద్ జిల్లా మావలలో 3(కమర్షియల్ కాంప్లెక్స్/ అపార్ట్ మెంట్) ప్లాట్లను విక్రయించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రెసిడెన్షియల్ ప్లాట్లు 315, 275, 266, 200, 150, 100, 60 చదరపు గజాల్లో ఉన్నాయని... కమర్షియల్ కాంప్లెక్స్/ అపార్ట్​మెంట్లకు అనువుగా ఉండే 6 పెద్ద ప్లాట్లు 6,500 చదరపు గజాల చొప్పున ఉన్నాయని వెల్లడించింది. 
హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీకి బాధ్యతలు..
రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, సమీప ప్రాంతాల్లో వెంచర్లు వేసేందుకు అనువైన భూముల వివరాలను సర్కార్ ఇప్పటికే సేకరించింది. తొలి విడతలో తొమ్మిది జిల్లాల్లో మాత్రమే ప్లాట్ల వేలం నిర్వహించనుంది. వేలం నిర్వహించే యంత్రాంగం, అనుభవం ఆయా జిల్లాల పరిపాలన యంత్రాంగానికి లేకపోవడంతో.. ఆ పనిని టీఎస్ఐఐసీ, హెచ్ఎండీఏకు అప్పగించింది. ఈ రెండు సంస్థల మధ్యవర్తిత్వం, ఆయా జిల్లా కలెక్టర్ల సహకారంతో వేలం పాటలు జరగనున్నాయి. ఇప్పటికే హెచ్‌‌‌‌ఎండీఏకు ఐదు జిల్లాలు, టీఎస్ఐఐసీకి ఐదు జిల్లాలు అప్పగించినట్లు తెలిసింది. 
త్వరలో మిగతా జిల్లాల్లోనూ? 
రాష్ట్ర ప్రభుత్వం నిరుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని విలువైన భూములను వేలం వేసింది. ఉప్పల్‌‌ భగాయత్‌‌, కోకాపేటలో భూములను హెచ్‌‌ఎండీఏ విక్రయించగా.. ఖానామెట్‌‌, పుప్పాలగూడలో భూములను టీఎస్ఐఐసీ ద్వారా విక్రయించింది. కోకాపేటలోని 49 ఎకరాల ద్వారా రూ.2,200 కోట్లు, ఖానామెట్‌‌లో 15 ఎకరాల ద్వారా రూ.730 కోట్లు, ఉప్పల్‌‌ భగాయత్‌‌లో 39 ఓపెన్‌‌ ప్లాట్ల విక్రయం ద్వారా రూ.474 కోట్ల ఆదాయం సమకూరింది. అన్ని వసతులు ఉండడం, ఎలాంటి చిక్కులు లేని ప్లాట్లు అని ప్రభుత్వం ప్రచారం చేస్తుండడంతో కొనుగోలుదారుల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జిల్లా కేంద్రాలు, వాటి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ కు బూమ్ రావడంతో సర్కార్ ఫోకస్ జిల్లాల వైపు మళ్లింది. త్వరలో మిగతా జిల్లాల్లోనూ వెంచర్లు వేసి ప్లాట్లు వేలం వేయనున్నట్లు తెలిసింది.