చెస్‌‌ వరల్డ్‌‌ కప్‌‌ నాలుగో రౌండ్‌‌లో టై బ్రేక్‌‌కు అర్జున్‌‌

చెస్‌‌ వరల్డ్‌‌ కప్‌‌ నాలుగో రౌండ్‌‌లో టై బ్రేక్‌‌కు అర్జున్‌‌

పంజిమ్‌‌: తెలంగాణ గ్రాండ్‌‌ మాస్టర్‌‌ అర్జున్‌‌ ఎరిగైసి.. చెస్‌‌ వరల్డ్‌‌ కప్‌‌ నాలుగో రౌండ్‌‌లో మరో డ్రా నమోదు చేశాడు. బుధవారం పీటర్‌‌ లీకో (హంగేరి)తో జరిగిన రెండో గేమ్‌‌ను అర్జున్‌‌ 36 ఎత్తుల వద్ద డ్రా చేసుకున్నాడు.  నిమ్జో ఇండియన్‌‌ ఓపెనింగ్‌‌లో తెల్లపావులతో ఆడిన అర్జున్‌‌ ఆరంభంలో దూకుడుగా ఎత్తులు వేశాడు. 16 రౌండ్ల వరకు గేమ్‌‌ను పూర్తిగా కంట్రోల్‌‌లో ఉంచుకున్నాడు. 

కానీ 20వ ఎత్తులో క్వీన్‌‌ను ట్రేడ్‌‌ చేయడంతో గేమ్‌‌ మలుపు తీసుకుంది. దాదాపు 26 నిమిషాల పాటు ఆలోచించినా సరైన ఎత్తు వేయలేకపోయాడు. దీన్ని ఆసరాగా చేసుకున్న లీకో గేమ్‌‌ను డ్రా వైపు తీసుకెళ్లాడు. ఇద్దరి ఖాతాలో చెరో పాయింట్ ఉండటంతో ఫలితం కోసం టైబ్రేక్‌‌ ఆడాల్సి ఉంది. రష్యా గ్రాండ్‌‌ మాస్టర్‌‌ డానిల్‌‌ డుబోవ్‌‌తో జరిగిన గేమ్‌‌ను ఆర్‌‌. ప్రజ్ఞానంద కూడా 38 ఎత్తుల వద్ద డ్రాగా ముగించాడు. తెలుగు గ్రాండ్‌‌ మాస్టర్‌‌ పెంటేల హరికృష్ణ.. నీల్స్‌‌ గ్రాండిలియుస్‌‌ (స్వీడన్‌‌)తో జరిగిన గేమ్‌‌ కూడా డ్రా అయ్యింది. టైబ్రేక్‌‌లో ప్రజ్ఞా, హరికృష్ణ గెలిస్తేనే తర్వాతి రౌండ్‌‌కు వెళ్తారు. నొడిర్బెక్‌‌ యాకుబోయెవ్‌‌ (ఉజ్బెకిస్తాన్‌‌)తో జరిగిన గేమ్‌‌లో వి. ప్రణవ్‌‌ ఓటమిపాలయ్యాడు.