
- పైలట్ ప్రాజెక్టు సక్సెస్‌తో రాష్ట్రవ్యాప్తంగా అమలు
- సంస్థ లాభనష్టాలు, జనం రద్దీకి అనుగుణంగా ట్రిప్పులు, సిబ్బంది హెల్త్ హిస్టరీపై సేవలు
హైదరాబాద్, వెలుగు: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను వినియోగిస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డు నెలకొల్పింది. హన్స ఈక్విటీ పార్టనర్స్ ఎల్‌ఎల్‌పీ అనే సంస్థఅందిస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్టీసీలో ఏఐ సేవలను వినియోగిస్తున్నారు. ఇప్పటికే ఆరు డిపోల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయగా మంచి ఫలితాలు వచ్చాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో అమలు చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఇందుకు సంస్థలోని ఈడీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఐదుగురు ఆఫీసర్లతో ఒక ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారు. వీళ్లకు హన్స ఈక్విటీ సంస్థ ఏఐ శిక్షణ ఇచ్చింది.
ఏఐ ఏం చేస్తుందంటే..
ఆర్టీసీలోని సుమారు 40 వేల మంది సిబ్బంది హెల్త్ హిస్టరీని ఏఐ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ఎవరైనా ఉద్యోగి సిక్ లీవ్‌లో ఉంటే, ఆయనకు ఉన్న ఆరోగ్య సమస్యలను గుర్తించి యాజమాన్యాన్ని అప్రమత్తం చేస్తుంది. ఉద్యోగిని కూడా అలర్ట్ చేస్తుంది. ఉద్యోగుల ఆరోగ్య సమస్యలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన సలహాలు, సూచనలు చేస్తుంది. ప్రతి నెల ఉద్యోగుల జీతాలు, డీజిల్, ఇతర నిర్వహణ ఖర్చులు, సంస్థకు వచ్చే ఆదాయాన్ని లెక్కిస్తుంది. లాభనష్టాలను లెక్కించి.. నెలవారీ ఖర్చుల్లో తగ్గింపు, ఆదాయ పెంపు మార్గాలపై యాజమాన్యానికి తగిన సూచనలు అందిస్తుంది.
ఇక పండుగల సమయంలో, శుభకార్యాలు ఉన్న రోజుల్లో రాష్ట్రంలోని ప్రధాన రూట్లలో జనం రద్దీ ఏ స్థాయిలో ఉంటుంది? అందుకు అనుగుణంగా ఎన్ని బస్సులు అవసరం? ఎన్ని ట్రిప్పులు నడపాలనే దానిపై లెక్కలు వేసి యాజమాన్యానికి తగిన ప్లాన్ రెడీ చేసి ఇస్తుంది. బస్సుల్లో రాకపోకల సమయంలో ప్రయాణికులకు ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలతో పాటు ప్యాసింజర్లకు కల్పించాల్సిన ఆధునిక సౌకర్యాలపై కూడా సూచనలు ఇస్తుంది.
ప్రత్యేక టీమ్ పర్యవేక్షణలో..
ఆర్టీసీలో ఏఐ సేవలను వినియోగిస్తున్న తీరుపై సంస్థ ఎండీ సజ్జనార్ ఇటీవల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఏఐ సేవలపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు మేనేజ్‌మెంట్ ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం ఏ రోజుకారోజు రాష్ట్రంలోని ఏయే డిపోల్లో ఏఐ సేవలను ఏ రీతిలో వినియోగిస్తున్నారు? వాటి ప్రభావం ఏ స్థాయిలో ఉంది? అనే దానిపై బస్ భవన్ నుంచి ప్రత్యేక టీమ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నది.