బీమా లేదంటే ఎట్లా..వడ్డీతో సహా ఇయ్యాల్సిందే

బీమా లేదంటే ఎట్లా..వడ్డీతో సహా ఇయ్యాల్సిందే

ఓ కేసులో హైకోర్టు తీర్పు 

హైదరాబాద్‌: ఇన్సూరెన్స్​ పరిహారానికి సంబంధించిన ఓ కేసులో రాష్ట్ర హైకోర్టు ఓ కీలక తీర్పును ఇచ్చింది. బాధిత కుటుంబానికి ఊరట కలిగేలా నష్ట పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. బి. కృష్ణయ్య అనే ఒక యువకుడు 2004లో యాక్సిడెంట్​లో చనిపోయాడు. అతడు మరో వ్యక్తితో కలిసి బైకుపై వెళుతుండగా యాక్సిడెంట్​ అయింది. వారి బైకును జీపు ఢీకొట్టడంతో కృష్ణయ్య చనిపోయాడు. అతడి కుటుంబానికి రూ.1.78 లక్షలు చెల్లించాలని  ఇన్సూరెన్స్ కంపెనీని కింది కోర్టు ఆదేశిస్తూ తీర్పు చెప్పింది. ఆ బైక్‌కు బీమా లేకపోవడంతో పరిహారంలో 50 శాతం బైక్‌ నడిపిన వ్యక్తి చెల్లించాలని, బీమా కంపెనీ 1.78 లక్షలకు 9 శాతం వడ్డీతో కృష్ణయ్య కుటుంబానికి చెల్లించాలని స్పష్టం చేసింది. అయితే, తన కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం ఇప్పించాలంటూ కృష్ణయ్య భార్య హైకోర్టును ఆశ్రయించింది. తాజా తీర్పుతో ఆమెకు భారీ ఊరట లభించింది. రోడ్డు ప్రమాదం జరిగే నాటికి కృష్ణయ్యకు నెలకు రూ.13,500 ఆదాయం వస్తున్నదని హైకోర్టు జడ్జి జస్టిస్‌ అమర్‌నాథ్‌ గౌడ్‌ పేర్కొన్నారు. దీనిని లెక్కించి, పరిహారం పెంచుతూ తీర్పు చెప్పారు. కృష్ణయ్య సంపాదనలో ఖర్చులు పోగా ఏడాదికి రూ.1.18 లక్షలు ఉంటాయని, 14 ఏండ్లకు 1.18 లక్షల చొప్పున రూ.16.54 లక్షలు, ఖర్చుల పేరిట రూ.70 వేలు, మైనర్‌కు రూ.50 వేలు కలిపి 17.74 లక్షలు చెల్లించాలని  ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేశిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది.