హైదరాబాద్, వెలుగు: పెండింగ్ సర్వీస్ రూల్స్, ప్రమోషన్లు, ఇతర సమస్యల పరిష్కారం కోసం హెడ్మాస్టర్లు పోరుబాట పట్టనున్నారు. ఈ మేరకు మూడు దశల పోరాటాన్ని తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం (టీజీహెచ్ఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్, ప్రధాన కార్యదర్శి జి.హేమచంద్రుడు శుక్రవారం ప్రకటించారు.
ఈనెల 25 -నుంచి మే 4 వరకు నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలను కలిసి సమస్యలను వివరించాలని నిర్ణయించారు. మే 8 నుంచి 17 వరకు జిల్లా స్థాయిలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, డీఈవోలను కలిసి వినతిపత్రాలు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.మే 21 నుంచి 31 వరకు రాష్ట్ర స్థాయిలో సీఎం, డిప్యూటీ సీఎం, సీఎస్, విద్యా శాఖ కార్యదర్శి, డైరెక్టర్లను కలవాలని నిర్ణయించారు. సంఘాలకు, భావజాలాలకు అతీతంగా అందరూ ఉద్యమంలో భాగస్వాములు కావాలని నేతలు పిలుపునిచ్చారు.

