- ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో 45.9 డిగ్రీల మేర రికార్డ్
- మొత్తంగా 12 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగానే టెంపరేచర్స్
- మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా మారిన వాతావరణం
- పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం నిప్పుల కుంపటిలా మసిలిపోతున్నది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో రెడ్అలర్ట్లోకి వెళ్లిపోయింది. 2016 ఏప్రిల్26న మంచిర్యాల జిల్లా దండేపల్లిలో 48.8 డిగ్రీల రికార్డ్ టెంపరేచర్ నమోదుకాగా..మళ్లీ పదేండ్లకు సోమవారం ఎండ తీవ్రత 46 డిగ్రీల మార్క్‌ను టచ్ చేసింది.
అత్యధికంగా నిజామాబాద్ జిల్లా మెండోరాలో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా బేల, నిర్మల్‌జిల్లా అక్కాపూర్, పెద్దపల్లి జిల్లా ఎక్లాస్పూర్లలో 45.9 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా బుద్దేశ్‌పల్లి, కామారెడ్డి జిల్లా బిచ్కుంద, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా భీమారంలో 45.8 డిగ్రీలు.. కరీంనగర్ జిల్లా ఇందుర్తి, నల్గొండ జిల్లా దామరచర్లలో 45.6, సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో 45.2, సిద్దిపేట జిల్లా చిట్యాలలో 45 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
మెదక్ జిల్లా కుల్చారంలో 44.6, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో 44.3, సూర్యాపేట జిల్లా చీదళ్లలో 44.2, హనుమకొండ జిల్లా ఖాజీపేటలో 44 డిగ్రీల మేర టెంపరేచర్లు రికార్డయ్యాయి. జనగామ, నారాయణపేట, సంగారెడ్డి జిల్లాల్లో 43.9, ములుగు, నాగర్‌కర్నూల్, వికారాబాద్, యాదాద్రి భువనగరి జిల్లాల్లో 43.6, గద్వాల, ఖమ్మం జిల్లాల్లో 43.5, మహబూబాబాద్, వరంగల్ 43.4, జయశంకర్ భూపాలపల్లి 43.2, మహబూబ్‌నగర్ 43.1, రంగారెడ్డి జిల్లాలో 43 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 42.5, వనపర్తిలో 42.3 డిగ్రీల చొప్పున టెంపరేచర్లున్నాయి
ఒక్కసారిగా మారిన వాతావరణం
హైదరాబాద్ సిటీ పరిధిలోనూ ఎండలు ఠారెత్తించాయి. అత్యధికంగా చాంద్రాయణగుట్టలో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎన్జీవోస్ కాలనీ, సరూర్‌నగర్, రాజేంద్రనగర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, సీతాఫల్మండిలో 42.4 డిగ్రీల టెంపరేచర్లు రికార్డ్ అయ్యాయి. హైదరాబాద్, వికారాబాద్, రంగారెడ్డి, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల, మహబూబ్‌నగర్, సిద్దిపేట, సంగారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో మధ్యాహ్నం 3 గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మబ్బులుపట్టి చల్లబడింది. పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి.
వారం రోజులు ఎండ మంటలు..
రాష్ట్రంలో వారం రోజుల పాటు భారీ ఎండలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే రెండ్రోజులు తీవ్రమైన వడగాడ్పులుంటాయని చెప్పింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. మరోవైపు, సాయంత్రం వేళల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వడగండ్లు పడతాయని తెలిపింది.
ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా, సోమవారం విపరీతమైన ఎండలు కొట్టినా.. ఉక్కపోత తక్కువగా ఉన్నది.

