ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టులో విచారణ..రెండు వారాల్లో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదే

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టులో విచారణ..రెండు వారాల్లో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదే

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారంలో ఇప్పటివరకు కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయని ఎమ్మెల్యేలు మరో 2 వారాల్లోగా సమర్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ గడువును చివరి చాన్స్​గా భావించాలని కూడా తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌ల ధర్మాసనం గురువారం ఈ కేసులను విచారించింది. ప్రతివాదుల్లో దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మినహా మిగతా ఎమ్మెల్యేలంతా ఇప్పటికే కౌంటర్లు దాఖలు చేశారని కోర్టుకు తెలిపారు.

ఈ ఇద్దరి ఎమ్మెల్యేల తరఫు లాయర్లు మరికొంత సమయం కోరడంతో, కోర్టు చివరిసారిగా గడువువిచ్చింది. కౌంటర్లు దాఖలైన తర్వాత పిటిషనర్లు వారం రోజుల్లో రిప్లై కౌంటర్లు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. అలాగే అన్ని పక్షాలు తమ రాతపూర్వక వాదనలను 3 వారాల్లోగా దాఖలు చేయాలని సూచించింది. కేసు తదుపరి విచారణను జులై 22కు వాయిదా వేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జి. జగదీశ్ రెడ్డి, కేపీ వివేకానంద, కె. సంజయ్, పల్లె రాజేశ్వర్ రెడ్డి, సీహెచ్. ప్రభాకర్, పాడి కౌశిక్ రెడ్డి తదితరులతో పాటు బీజేపీ నేత ఎ.మహేశ్వర్ రెడ్డి మొత్తం 10 పిటిషన్లు దాఖలు చేశారు.