అగ్నిమాపక శాఖలో సౌకర్యాల కొరతపై హైకోర్టు సీరియస్

 అగ్నిమాపక శాఖలో సౌకర్యాల కొరతపై హైకోర్టు సీరియస్
  • ప్రభుత్వానికి నోటీసులు జారీ 

హైదరాబాద్, వెలుగు: విపత్తులను ఎదుర్కోవడానికి అగ్నిమాపకశాఖలో ఉన్న సౌకర్యాల కొరతపై ప్రభుత్వానికి గురువారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అగ్నిమాపక యంత్రాల పనితీరు, ఆక్సిజన్‌‌ మాస్క్‌‌లు, నీటి సౌకర్యాలు తదితరాల వివరాలను సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. గతేడాది పాతబస్తీలోని గుల్జార్‌‌హౌస్‌‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది మృతి చెందిన సంఘటనలో, అగ్నిమాపకశాఖ వైఫల్యంపై హైకోర్టు సిట్టింగ్‌‌ లేదా మాజీ న్యాయమూర్తితో జ్యుడిషియల్‌‌ విచారణ జరిపించాలని కోరుతూ బాధిత కుటుంబానికి చెందిన సంతోష్‌‌ గుప్తా హైకోర్టుకు లేఖ రాశారు.

ప్రమాద సమయంలో అగ్నిమాపకశాఖలో సరైన పరికరాలు లేకపోవడం, ఉన్నవి సరిగా పనిచేయకపోవడం, ఆక్సిజన్‌‌ మాస్క్‌‌లు లేకపోవడం వంటివాటి వల్ల తమ కుటుంబంలో ప్రాణనష్టం ఎక్కువ జరిగిందని తెలిపారు. సమాచారం అందినా సకాలంలో అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్స్‌‌లు సంఘటనా స్థలానికి చేరుకోలేదని చెప్పారు. అగ్నిమాపకశాఖ అధికారులకు సర్కారు సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో మంటల్లో చిక్కుకున్నవారిని రక్షించడానికి వెనుకంజ వేశారని పేర్కొన్నారు.

ఈ లేఖలోని అంశాలను పరిశీలించిన హైకోర్టు పిల్‌‌గా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై  చీఫ్‌‌ జస్టిస్‌‌ అపరేశ్‌‌ కుమార్‌‌ సింగ్, జస్టిస్‌‌ జీఎం మొహియుద్దీన్‌‌తో కూడిన బెంచ్‌‌ విచారణ చేపట్టి ప్రతివాదులైన హోంశాఖ ముఖ్యకార్యదర్శి, విపత్తుల నిర్వహణ శాఖ డైరెక్టర్‌‌ జనరల్, వైద్యఆరోగ్యశాఖ డైరెక్టర్, సిటీ పోలీసు కమిషనర్‌‌కు నోటీసులు జారీ చేస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.