దిశ ఎన్‌‌కౌంటర్‌‌ కేసులో .. పోలీసులకు హైకోర్టు నోటీసులు

దిశ ఎన్‌‌కౌంటర్‌‌ కేసులో .. పోలీసులకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, వెలుగు: దిశ అత్యాచార కేసులో నిందితుల ఎన్‌‌కౌంటర్‌‌ ఘటనలో సంబంధమున్న పోలీసులు, పోలీసు అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తమను కూడా ప్రతివాదులుగా చేర్చాలని, తమ వాదనలు కూడా వినాలని కోరుతూ పోలీసులు, పోలీసు ఉన్నతాధికారులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌‌ను బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కోర్టు తమ ముందుకు వచ్చిన వారి వాదనలు వినాల్సి ఉందని తెలిపింది. 

ఈ నేపథ్యంలో పోలీసులు, పోలీస్‌‌ ఆఫీసర్లకు నోటీసులు ఇస్తున్నట్టు చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ అలోక్‌‌  అరాధే, జస్టిస్‌‌ అనిల్‌‌కుమార్‌‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఎన్‌‌కౌంటర్‌‌లో పాల్గొన్న పోలీసులపై 302 సెక్షన్‌‌ కింద (హత్యానేరం) కేసు నమోదు చేయాలని, ఈ కేసు దర్యాప్తును సిట్‌‌ నుంచి సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ ఎన్ కౌంటర్ బాధితులు పిటిషన్ దాఖలు చేశారు.  దీనితో పాటు తమ వాదనలు కూడా వినాలంటూ పోలీసులు మధ్యంతర పిటిషన్ వేయడంతో విచారణను వాయిదా వేసింది.