
హైదరాబాద్, వెలుగు: ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన సీనియర్ అడ్వకేట్ కె. ప్రతాప్ రెడ్డి (94)కి హైకోర్టు శుక్రవారం నివాళులు అర్పించింది. చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ అధ్యక్షతన హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు సమావేశమై సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా సీజే సింగ్, అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతాప్ రెడ్డి న్యాయవ్యవస్థకు అందించిన సేవలను గుర్తు చేశారు.
ఎంతోమంది ప్రతాప్ రెడ్డి ఆఫీస్ నుంచి న్యాయవాదులుగా వృత్తిని ప్రారంభించి హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల స్థాయికి ఎదిగారన్నారు. సమావేశం రెండు నిముషాలు మౌనం పాటించి సంతాపం తెలిపింది. ప్రతాప్ రెడ్డి కుటుంబసభ్యులు, బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ తదితరులు పాల్గొన్నారు.