హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని భూదాన్ భూముల అక్రమాలకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసును కొట్టివేయడానికి హైకోర్టు నిరాకరించింది. ఈడీ సమర్పించిన ప్రాథమిక ఆధారాల నేపథ్యంలో దర్యాప్తు కొనసాగించాల్సిందేనని తేల్చి చెప్పింది.
నాగారంలోని సర్వే నెం.181, 182, 194లోని భూదాన్ భూముల అక్రమాలపై పోలీసుల కేసు ఆధారంగా ఈడీ నమోదు చేసిన ఈసీఐఆర్ కొట్టివేయాలని కోరుతూ.. నిందితులు ఎం.ఎ.అక్తర్, లతీఫ్ రెహమాన్ షర్ఫాన్, అబ్దుల్ రెహమాన్ షర్ఫాన్‌లు పిటిషన్‌లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లపై జస్టిస్ పి.శ్యాం కోశీ, జస్టిస్ సుద్దాల చలపతిరావులతో కూడిన బెంచ్ విచారణ జరిపి గురువారం తీర్పిచ్చింది. ప్రాథమిక దర్యాప్తులో అనేక అక్రమాలు, భారీ ఎత్తును డబ్బు లావాదేవీలు జరిగినట్లు తేలిందన్న ఈడీ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ఈడీ కేసును రద్దు చేయాలన్న నిందితుల పిటిషన్‌లను కొట్టివేసింది.
