కరోనా కష్టంలో ఉంటే ఫీజుల పెంపు ఏంది?

కరోనా కష్టంలో ఉంటే ఫీజుల పెంపు ఏంది?
  • ఏ ప్రాతిపదికన ఫీజులు పెంచారో కారణాలు చెప్పలేదు
  • సగం ఫీజులు చెల్లించాలని మధ్యంతర ఉత్తర్వులిస్తున్నాం
  • తుది తీర్పునకు లోబడే ఫీజుల చెల్లింపు ఉంటుంది
  • పీజీ మెడికల్ ఫీజుల పెంపుపై హైకోర్టు ఉత్తర్వులు
  • తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా

హైదరాబాద్, వెలుగు: ‘‘జనమంతా కరోనా కష్టాల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పీజీ మెడికల్​ ఫీజులను పెంచడం సబబుగా లేదు. తెలంగాణ అడ్మిషన్స్, ఫీజు రెగ్యులేటరీ కమిటీ(టీఏఎఫ్‌ఆర్‌సీ) ఏ ప్రాతిపదికన ఫీజులు నిర్ణయించిందో మాకు చెప్పలేదు. ప్రభుత్వం ఫీజుల పెంపు జీవోలో పెంపుదలకు కారణాలు చెప్పలేదు. ఈ పరిస్థితుల్లో మెడికల్‌ స్టూడెంట్లు, మెడికల్‌ కాలేజీలను దృష్టిలో పెట్టుకుని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నాం’’ అని హైకోర్టు స్పష్టం చేసింది. ‘‘2016లో నిర్ణయించిన ఫీజుతోపాటు జీవో 20 ప్రకారం పెంచిన మొత్తంలో 50 శాతాన్ని కన్వీనర్‌ కోటా ఏ కేటగిరి స్టూడెంట్లు చెల్లించాలి. మిగిలిన 50 శాతానికి బాండ్‌ రాసి ఇవ్వాలి. మేనేజ్​మెంట్‌ కోటా ‘బీ’ కేటగిరి స్టూడెంట్లు కూడా 2016లో నిర్ణయించిన ఫీజుతోపాటు తాజాగా పెంచిన మొత్తంలో 60 శాతం చెల్లించాలి. మిగిలిన 40 శాతానికి బాండ్‌ సమర్పించాలి. తుది తీర్పునకు లోబడే ఫీజుల చెల్లింపు ఉంటుంది” అని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. పీజీ మెడికల్‌ ఫీజులను పెంచుతూ గత నెల 14న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 20ను సవాల్‌ చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఇదే తరహాలో మూడేళ్ల క్రితం దాఖలైన పిటిషన్లతో కలిపి ఈ రిట్‌ను కూడా విచారిస్తామని కోర్టు స్పష్టం చేసింది.

తుది తీర్పునకు లోబడే ఫీజుల పెంపు

పిటిషనర్‌ తరఫున లాయర్​ సందీప్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పీజీ మెడికల్‌ ఫీజుల్ని భారీగా పెంచారని, కన్వీనర్, మేనేజ్​మెంట్‌ కోటా కింద ఫీజుపెంపును అడ్డుకోవాలని కోరారు. ఈ వాదనను కాలేజీల తరఫు లాయర్లు వ్యతిరేకించారు. కాలేజీల ఖర్చులు, జీతభత్యాలు పెరిగిన నేపథ్యంలో ఫీజుల పెంపును అడ్డుకోవద్దని,  జీతాలతోపాటు స్టూడెంట్స్‌కు స్టైఫండ్‌ చెల్లింపులూ ఉన్నాయన్నారు. టీఏఎఫ్‌ఆర్‌సీ తరఫు లాయర్‌ వాదనలు వినిపిస్తూ.. ఫీజుల పెంపు శాస్త్రీయంగానే జరిగిందని, రూల్స్​ ప్రకారమే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వాదనలు విన్న బెంచ్​ స్పందిస్తూ.. కరోనా వల్ల రాష్ట్రమే కాక దేశం మొత్తం ఇబ్బందులను ఎదుర్కొంటోందని, ఈ పరిస్థితుల్లో స్టూడెంట్లు, పేరెంట్స్​ ఫీజులను చెల్లించేందుకు కష్టాలు పడుతున్నారని పేర్కొంది. స్టూడెంట్లు, కాలేజీలను దృష్టిలో పెట్టుకుని ఫీజుల చెల్లింపుపై మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నామని, తుది తీర్పునకు లోబడే ఫీజుల పెంపు ఉంటుందని స్పష్టం చేసింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది.

పోతిరెడ్డిపాడుపై మాట్లాడేందుకు కేసీఆర్ కు టైం ఎప్పుడొస్తది?