కాళేశ్వర్యం కమిషన్ నివేదికపై స్టే ఇవ్వలేమన్న హైకోర్టు : కేసీఆర్, హరీశ్ లకు ఎదురుదెబ్బ

కాళేశ్వర్యం కమిషన్ నివేదికపై స్టే ఇవ్వలేమన్న హైకోర్టు : కేసీఆర్, హరీశ్ లకు ఎదురుదెబ్బ

 తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీశ్ రావులకు ఎదురుదెబ్బ తగిలింది. కాళేశ్వరం రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు  స్పష్టం చేసింది.  పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును కొట్టివేయాలంటూ కేసీఆర్, హరీశ్ రావు వేసిన పిటిషన్లను విచారించిన హైకోర్టు.. పిటిషనర్లు కోరిన విధంగా ఈ సమయంలో  స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది.  అసెంబ్లీలో చర్చ ఉంది కాబట్టి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పింది. ఈ సందర్భంగా పీసీ ఘోష్ కమిషన్  నివేదికను పబ్లిక్ డొమైన్ లో  ఉంటే వెంటనే తొలగించాలని ప్రభుత్వానికి సూచించింది హైకోర్టు.  పూర్తి వివరాలతో  మూడు  వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.  తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.  

 విచారణ సందర్భంగా హైకోర్టులో కమిషన్ తరపున వాదనలు అడ్వొకేట్ జనరల్ నిరంజన్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెడుతామని కోర్టుకు తెలిపారు. అసెంబ్లీలో ప్రవేశ పెట్టాకే చర్యలు తీసుకుంటామని చెప్పారు.  అసెంబ్లీలో చర్చించిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. పిటిషనర్స్ ఇద్దరు ప్రస్తుత ఎమ్మెల్యేలుగానే ఉన్నారన్న ఏజీ.. పిటిషనర్లపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని - చెప్పారు. అసెంబ్లీలో చర్చ తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని కోర్టుకు వివరణ ఇచ్చారు -నిరంజన్‌రెడ్డి..

కమిషన్‌ రిపోర్టు  ఇంకా తమకు అందలేదన్న  -చీఫ్‌ జస్టిస్‌.. కమిషన్ నివేదికను వెబ్ సైట్లో  అప్లోడ్ చేయడాన్ని తప్పుబట్టారు.  ఒకవేళ వెబ్ సైట్లో  ఉంటే రిపోర్టును వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ సందర్బంగా నివేదికను ప్రభుత్వం ఎక్కడా పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టలేదని చెప్పారు ఏజీ.  ఇరు తరపున వాదనలు విన్న హైకోర్టు.. కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చ ఉన్నందున పిటిషనర్లు కోరినట్టు స్టే ఇవ్వలేమని చెప్పింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.