ప్రైవేటు మెడికల్‌‌ కాలేజీల్లో స్టైపెండ్‌‌పై వివరణ ఇవ్వండి : హైకోర్టు

ప్రైవేటు మెడికల్‌‌ కాలేజీల్లో స్టైపెండ్‌‌పై వివరణ ఇవ్వండి : హైకోర్టు
  • రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు మెడికల్‌‌ కాలేజీల్లో అక్రమ స్టైపెండ్‌‌ ఉపసంహరణకు సంబంధించి వివరాలు సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్టైపెండ్‌‌కు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ జాతీయ మెడికల్‌‌ కమిషన్, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, డైరెక్టర్‌‌ ఆఫ్‌‌ మెడికల్‌‌ ఎడ్యుకేషన్‌‌లకు నోటీసులు జారీ చేస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

స్టైపెండ్‌‌ను అక్రమంగా ఉపసంహరించుకుంటున్న వైనంపై దర్యాప్తు జరిపించేలా ఎన్‌‌ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలంటూ విద్యార్థులు పంపిన ఇ మెయిళ్లను హైకోర్టు పిల్‌‌గా తీసుకుంది. ప్రైవేటు, ప్రభుత్వ మెడికల్‌‌ కాలేజీల్లో ఇంటర్న్‌‌షిప్ విద్యార్థులకు స్టైపెండ్‌‌ చెల్లించాలని ఎన్‌‌ఎంసీ ఆదేశాలున్నప్పటికీ వాటిని ఉల్లంఘిస్తున్నారని, ఇంటర్న్‌‌షిప్ మంజూరు చేసేముందు విద్యార్థుల నుంచి ఖాళీ చెక్‌‌లపై సంతకాలు తీసుకోవడం ద్వారా వారికివ్వాల్సిన స్టైపెండ్‌‌ను ప్రైవేటు కాలేజీలు తీసుకుంటున్నాయంటూ ఇ మెయిళ్లలో ఆరోపించారు.