చీపిరికట్టతో చంపిండ్రన్న పోలీసులు.. విస్తుపోయిన హైకోర్టు

చీపిరికట్టతో చంపిండ్రన్న పోలీసులు.. విస్తుపోయిన హైకోర్టు

వెలుగు: కుక్కపిల్లా.. అగ్గిపుల్లా.. సబ్బుబిళ్లా.. కాదేదీ కవితకనర్హం అని శ్రీశ్రీ చెప్పారు. నిజమే వేటినీ తక్కువ చేసి చూడకూడదు. చీపురు పుల్లే అనుకునేరు. దాంతో హత్య కూడా చేసేయొచ్చని రాష్ట్ర పోలీసులు చెప్పడంతో హైకోర్టు విస్తుపోయింది.

ఇదీ కథ..

కరీంనగర్‌‌‌‌ జ్లిలాకు చెందిన తూర్పాటి కామాక్షి అనే మహిళను వెంకటమ్మ, ఆమె కొడుకు రాజశేఖర్‌‌‌‌ చీపుర కట్టతో కొట్టి చంపారంటూ పోలీసులు కేసు పెట్టారు. విరిగిపోయిన చీపురు కట్టతో కామాక్షిని కొట్టి చంపారని ఎఫ్ఐఆర్‌‌‌‌లో పేర్కొన్నారు.ఈ కేసును విచారించిన కింది కోర్టు వారిద్దరికీ యావజ్జీవ జైలు శిక్ష విధించింది. దాంతో తమకు బెయిల్‌‌‌‌ ఇవ్వాలంటూ తల్లీకొడుకులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ ఆర్ఎస్‌‌‌‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ ఎ.రాజశేఖర్‌‌‌‌రెడ్డిలతో కూడిన బెంచ్‌‌‌‌ మంగళవారం విచారణ జరిపింది.

‘‘చీపురు కట్టతో.. అదీ విరిగిపోయిన చీపురు పుల్లలున్న దాంతో కొట్టి హత్య చేశారా? చీపురు పుల్లలతో కొడితే ప్రాణాలు పోతాయా’’ అంటూ బెంచ్‌‌‌‌ విస్మయం వ్యక్తం చేసింది. విరిగిపోయిన చీపురు కట్టతో కొట్టారని పోలీసులు ఎఫ్ఐఆర్‌‌‌‌లో పేర్కొన్నారని, అయితే డాక్టర్ల నివేదికలో కామాక్షి పక్కటెముకలు విరిగాయని, బ్రెయిన్‌‌‌‌ హెమరేజ్‌‌‌‌తో మృతి చెందినట్లు ఉందని వారి తరఫు లాయర్‌‌‌‌ బెంచ్‌‌‌‌ దృష్టికి తెచ్చారు. చీపురుతో విపరీతంగా కొట్టడం వల్లే కామాక్షి చనిపోయిందని, ముమ్మాటికీ ఇది హత్యేనని పోలీసుల తరఫున పబ్లిక్‌‌‌‌ ప్రాసిక్యూటర్‌‌‌‌ వాదించారు. వాదనలు విన్న కోర్టు కేసు వివరాల్లోకి వెళ్లకుండానే ముద్దాయిలిద్దరికీ ముందస్తు బెయిల్‌‌‌‌ మంజూరు చేసింది. ఇద్దరూ చెరో రూ.30 వేల విలువైన పూచీకత్తు సమర్పించాలని, ప్రతి వారం పోలీసుల ముందు హాజరుకావాలని, విచారణ సమయంలో కోర్టుకు హాజరుకావాలని, ఎక్కడుంటారో పోలీసులకు చెప్పాలని షరతులు విధించింది.