అమీన్‌‌‌‌పూర్‌‌‌‌ పునరుద్ధరణ పనులపై స్టే 

అమీన్‌‌‌‌పూర్‌‌‌‌ పునరుద్ధరణ పనులపై స్టే 
  •     హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
  •     93.15 ఎకరాల్లో సుందరీకరణ కొనసాగించొచ్చు

హైదరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల్లా అమీన్‌‌‌‌పూర్‌‌‌‌ మండలం సర్వే నం.231లోని అమీన్‌‌‌‌పూర్‌‌‌‌ (పెద్దచెరువు) పునరుద్ధరణ పనులపై హైకోర్టు సోమవారం మధ్యంతర స్టే విధించింది. కానీ ఇప్పటికే అధికారికంగా ధ్రువీకరించిన 93.15 ఎకరాల్లో సుందరీకరణ పనులు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. చెరువు ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌పై యథాతథస్థితి కొనసాగించాలని ఆదేశించింది. సర్వే నం.143, 146, 150లోని ప్లాట్లలో పునరుద్ధరణ పనుల పేరుతో అధికారులు జోక్యం చేసుకుంటున్నారంటూ దాఖలైన 100కుపైగా పిటిషన్లను జస్టిస్‌‌‌‌ బి.విజయ్‌‌‌‌సేన్‌‌‌‌రెడ్డి విచారించారు.

పిటిషనర్ల తరపు న్యాయవాదులు ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌ 93.15 ఎకరాలేనని, ఇదే విషయాన్ని హైకోర్టు 2019లో ధ్రువీకరించిందని తెలిపారు. అదనపు ఏజీ వాదిస్తూ నీటిపారుదల శాఖ రికార్డులు, గూగుల్‌‌‌‌ఎర్త్‌‌‌‌, ల్యాండ్‌‌‌‌శాట్‌‌‌‌ చిత్రాల ఆధారంగా ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌ 461 ఎకరాలుగా ఉందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి 93.15 ఎకరాల విస్తీర్ణంపై యథాతథస్థితి కొనసాగించాలని, జులై 13న జారీ చేసిన జీవో 678ను తదుపరి ఉత్తర్వుల వరకు అమలు చేయరాదని ఆదేశించారు. పిటిషనర్లు వివాదాస్పద ప్రాంతంలో నిర్మాణాలు, అభివృద్ధి పనులు చేపట్టరాదన్నారు. హెచ్‌‌‌‌ఎండీఏను సుమోటోగా ప్రతివాదిగా చేర్చి విచారణను అక్టోబర్‌‌‌‌ 5కు వాయిదా వేశారు.