డీఎస్సీ లో దివ్యాంగుల నియామక ఉత్తర్వులపై హైకోర్టు స్టే

డీఎస్సీ లో దివ్యాంగుల నియామక ఉత్తర్వులపై హైకోర్టు స్టే

హైదరాబాద్, వెలుగు: డీఎస్సీ-2017 ఉపాధ్యాయ నియామకాల్లో దివ్యాంగుల కోటా వివాదంపై  సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ అంశంపై పెండింగ్‌‌‌‌లో ఉన్న ఇతర పిటిషన్లతో కలిపి  విచారిస్తామని  ప్రకటించింది. 2017లో రాష్ట్ర ప్రభుత్వం 5,415 టీచర్​ పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్​లో ఎస్జీటీ  పోస్టుల భర్తీలో దివ్యాంగుల కోటా ఖాళీలను మార్చడంపై వివాదం మొదలైంది. ఆ మార్పిడి విధానం చట్టవిరుద్ధమని మెదక్ జిల్లాకు చెందిన శ్రీనివాస్‌‌‌‌గౌడ్‌‌‌‌తో పాటు మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. 

దీనిపై  సింగిల్ జడ్జి టీజీపీఎస్సీను తప్పుబట్టారు. బ్యాక్‌‌‌‌లాగ్ ఖాళీల భర్తీలో రోస్టర్ విధానం సరిగా అమలు కాలేదని అభిప్రాయపడుతూ, ఖాళీలను తిరిగి సవరించి మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ హైకోర్టులో అప్పీల్ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ఇదే అంశంపై పెండింగ్‌‌‌‌లో ఉన్న అప్పీళ్లను కూడా ఈ కేసుతో జత చేయాలని ఆదేశించింది. అప్పటివరకు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధిస్తూ విచారణను వాయిదా వేసింది.