గడువులోగా పీఎంఏవై లబ్ధిదారుల ధ్రువీకరణ పూర్తవ్వాలి.. కలెక్టర్లకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ఆదేశం

గడువులోగా పీఎంఏవై లబ్ధిదారుల ధ్రువీకరణ పూర్తవ్వాలి.. కలెక్టర్లకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన– -గ్రామీణం (పీఎంఏవై–-జీ) లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్లను హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) ఆదేశించారు. కేంద్రం విధించిన తుది గడువు ఈ నెల 30లోగా ‘ఆవాస్ ప్లస్’ సర్వే వివరాల ధ్రువీకరణ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

 గత సెప్టెంబర్ 30 నాటికి పూర్తయిన ఆవాస్ ప్లస్ సర్వేలో మొత్తం 11.56 లక్షల గ్రామీణ గృహాలను కవర్ చేశారు. తొలుత 98 వేల గృహాలకు ధ్రువీకరణ చేయాలని ప్రతిపాదించిన కేంద్ర ప్రభుత్వం.. ప్రస్తుతం ఈ సంఖ్యను భారీగా పెంచుతూ 5,72,415 గృహాలకు ధ్రువీకరణ తప్పనిసరి చేసింది. కాగా, ఇంత పెద్ద సంఖ్యలో లబ్ధిదారుల డేటా ధ్రువీకరణను మూడు స్థాయిల్లో నిర్వహించాల్సి ఉంది. 

గ్రామ స్థాయిలో ఏఈ, బ్లాక్ స్థాయిలో ఎంపీడీఓ, జిల్లా స్థాయిలో పీడీ ధ్రువీకరించాలి. అయితే, ఈ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయడం సవాల్‌‌గా మారింది. ఈ నేపథ్యంలో తొలిస్థాయి తనిఖీని వారం రోజుల్లోనే పూర్తి చేయాలని కలెక్టర్లను ఎండీ కోరారు. అన్ని స్థాయిల్లో తనిఖీ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయడానికి వీలుగా వెంటనే అదనపు అధికారులను నియమించి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.