
ఇంటర్ ఫలితాల్లో తప్పుల వ్యవహారంలో ఇద్దరు లెక్చరర్లపై వేటు పడింది. మంచిర్యాల జిల్లాకు చెందిన నవ్య అనే విద్యార్థినికి సెకండియర్ తెలుగు సబ్జెక్టు లో 99 మార్కులురాగా.. 00 గావచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఎగ్జామినర్ డి.ఉమాదేవి, స్క్రూటినైజర్ విజయ్ కుమార్ పై ఇంటర్ బోర్డు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉమాదేవి రంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రైవేటు కాలేజీలోలెక్చరర్ గా పని చేస్తున్నారు. నవ్య ఆన్సర్ షీట్ వ్యాల్యుయేషన్ చేసిన ఆమె.. ఓఎంఆర్ షీట్లో మార్కులను తప్పుగా బబుల్ చేశారు. దీంతో బోర్డు ఆమెకు రూ.5వేలు జరిమానా విధించింది. సదరు కాలేజీ యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది. ఇక విజయ్ కుమార్ రంగారెడ్డి జిల్లా కొత్తూరు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర జూనియర్ కాలేజీలో లెక్చరర్ గా చేస్తున్నారు. ఉమాదేవి తప్పుగా బబుల్ చేసినా ఆయన గుర్తించలేదు. దీంతో విజయ్ ను సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశిస్తున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ఆదివారం ఓ ప్రకటనలోవెల్లడించారు.