ఇంటర్ పరీక్షలు షురూ..తొలిరోజు ఫస్టియర్లో 96.90 శాతం హాజరు

ఇంటర్ పరీక్షలు షురూ..తొలిరోజు ఫస్టియర్లో 96.90 శాతం హాజరు
  • సెంటర్లను తనిఖీ చేసిన ఇంటర్ బోర్డు సెక్రటరీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఫస్టియర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్ ఎగ్జామ్ నిర్వహించారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,14,598 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, వారిలో 4,98,695 మంది (96.90 శాతం) హాజరయ్యారు. 15,903 మంది విద్యార్థులు వివిధ కారణాలతో పరీక్షలకు అటెండ్ కాలేదు. మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని అధికారులు ప్రకటించారు.

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌తో పాటు మేడ్చల్, రంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి అన్ని జిల్లాల్లో సెంటర్లను ఇంటర్  బోర్డు నియమించిన ప్రత్యేక అబ్జర్వర్లు పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి ఫిర్యాదులు అందలేదని, విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాశారని అధికారులు పేర్కొన్నారు. గురువారం సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

కాగా..పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షించేందుకు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య స్వయంగా రంగంలోకి దిగారు. నగరంలోని పలు సెంటర్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌లోని అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్, సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజ్, సెయింట్ మేరీస్ సెంటెనరీ కాలేజీలతో పాటు మారేడ్‌‌‌‌‌‌‌‌పల్లిలోని ఎంఆర్ఎంఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, ఎక్సలెన్సియా జూనియర్ కాలేజీలను ఆయన సందర్శించారు. పరీక్షా కేంద్రాల్లో  సౌకర్యాలను, ఇన్విజిలేషన్ తీరును పరిశీలించారు.పరీక్షలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరుగుతుండటంపై సంతృప్తి వ్యక్తం చేశారు.