ఉపాధి లక్ష్యంగా డిగ్రీ, పీజీల్లో 39 కొత్త కోర్సులు

ఉపాధి లక్ష్యంగా డిగ్రీ, పీజీల్లో 39 కొత్త కోర్సులు
  •  ..టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి వెల్లడి

.హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా 39 కొత్త కోర్సులను రూపొందించామని తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (టీజీసీహెచ్ఈ) చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కలలను నిజం చేసేలా విజన్ 2047 లక్ష్యంతో వచ్చే కొత్త విద్యాసంవత్సరం నుంచే కొత్త కోర్సులను ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడించారు. మంగళవారం టీ సాట్ నెట్ వేదికపై యూజీ, పీజీ కోర్సుల్లో కొత్త, ఎమెర్జింగ్ కోర్సులపై అవగాహన కల్పించారు. డిగ్రీ స్టూడెంట్ల కోసం19 కోర్సులు, పీజీ విద్యార్థుల కోసం మరో 10 కోర్సులను ఆచరణలోకి తీసుకురాబోతున్నామన్నారు.

వీటితో పాటు చదువుకుంటూనే పని నేర్చుకునేలా అప్రెంటిస్‌‌షిప్ ఎనేబుల్డ్ డిగ్రీ ప్రోగ్రామ్స్ కింద మరో 10 కోర్సులను ప్రవేశపెడుతున్నట్టు స్పష్టం చేశారు. 2030 నాటికి పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో తెలంగాణలోని వివిధ రంగాల్లో రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశముందని, దీని ద్వారా దాదాపు 20 లక్షల ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనా వేశారు. ఆ ఉద్యోగాలను అందిపుచ్చుకునేలా మన యువతను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన ఉద్దేశమని చైర్మన్ పేర్కొన్నారు.

నైపుణ్యం లేని చదువు వ్యర్థం:

ఉన్నత చదువులు ఎన్ని చదివినా, చేతిలో నైపుణ్యం లేకపోతే ప్రయోజనం ఉండదని మండలి వైస్ చైర్మన్ ఇటిక్యాల పురుషోత్తం స్పష్టం చేశారు. మరో వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్కే మహమూద్ మాట్లాడుతూ.. ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని, ఆ దిశగా వర్సిటీలకు దిశానిర్దేశం చేస్తున్నామని తెలిపారు.కొత్త కోర్సులను ప్రారంభించే కళాశాలలు తప్పనిసరిగా అత్యాధునిక ల్యాబ్‌‌లు ఏర్పాటు చేయాలని మండలి సెక్రటరీ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ సూచించారు. నాణ్యమైన బోధన, పరిశోధనలపై కౌన్సిల్ నిరంతరం నిఘా ఉంచుతుందని పేర్కొన్నారు.