రెండు రోజులు చల్లబడి.. మళ్లీ మండుతున్న తెలంగాణ.. 12 జిల్లాల్లో 46 డిగ్రీలకుపైనే ఎండ

రెండు రోజులు చల్లబడి.. మళ్లీ మండుతున్న తెలంగాణ.. 12 జిల్లాల్లో 46 డిగ్రీలకుపైనే ఎండ
  • మరో ఐదు జిల్లాల్లోనూ 45 డిగ్రీలకన్నా ఎక్కువే
  • అత్యధికంగా మంచిర్యాల జిల్లా తాండూరులో 46.4 డిగ్రీలు

హైదరాబాద్, వెలుగు: ఒక్కరోజు రెస్ట్​ ఇచ్చాయో లేదో.. ఎండలు మళ్లీ మండిపోతున్నాయి. బుధవారం 42 డిగ్రీలకు దిగొచ్చిన ఉష్ణోగ్రతలు.. గురువారం మళ్లీ 46 డిగ్రీల మార్క్​ను టచ్ చేశాయి. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 46 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో ఐదు జిల్లాల్లోనూ 45 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు రికార్డయ్యాయి. 

ఇంకో నాలుగు జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. అత్యధికంగా మంచిర్యాల జిల్లా తాండూరులో 46.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దపల్లి జిల్లా ముత్తారం, వరంగల్​ జిల్లా కాపులకనపర్తిలో 46.3 డిగ్రీలు, జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కాటారం, ఖమ్మం జిల్లా తిమ్మారావుపేట, కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా బెజ్జూరు, నిజామాబాద్​జిల్లా బెల్లాల్​లో 46.2, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామపట్నం, జగిత్యాల జిల్లా గుళ్లకోట, మహబూబాబాద్ జిల్లా గార్ల, సూర్యాపేట జిల్లా నాగారంలో 46.1, నిర్మల్​ జిల్లా ముజిగిలలో 46 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

ములుగు జిల్లా ఏటూరునాగారంలో 45.6, హనుమకొండ జిల్లా పూలకుర్తి, కరీంనగర్​ జిల్లా వీణవంకల్లో 45.4, ఆదిలాబాద్ జిల్లా తాంసి, నల్గొండ జిల్లా టిక్యా తండాల్లో 45.3 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. హైదరాబాద్ సిటీ పరిధిలోని ముషీరాబాద్​లో అత్యధికంగా 42.4 డిగ్రీల టెంపరేచర్​నమోదైంది. కార్వాన్, అంబర్​పేటల్లో 42.3, బేగంపేటలో 42.2, సంతోష్​నగర్​లో 42.1, చాంద్రాయణగుట్టలో 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.