వర్షాకాలంలో వానలు తక్కువే పడుతాయని ఐఎండీ అంచనా వేసింది. సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. సోమవారం మాన్సూన్ ఎర్లీ రిపోర్టును ఐఎండీ విడుదల చేసింది. 92 శాతం మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
రాష్ట్రంలో ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల్, సిరిసిల్ల, మంచిర్యాల్, పెద్దపల్లి జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదయ్యే చాన్స్ ఉందని తెలిపింది. అదే సమయంలో ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో సగటు కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. లానినా పరిస్థితులు బలహీన పడుతున్నాయని, వర్షాకాలం నాటికి ఎల్ నినో బలపడుతుందని ఐఎండీ పేర్కొంది.
ఇదిలా ఉండగా.. తెలంగాణలో రాబోయే మూడు రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా, పగలంతా ఎండలతో అల్లాడుతున్న జనం, రాత్రి ఉక్కపోతతో సతమతమవుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత ఉష్ణోగ్రతలు రాబోయే మూడు రోజుల్లో క్రమంగా మరో 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందంటూ ఐఎండీ బాంబు పేల్చింది. దీనివల్ల చాలా జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల మార్కు దాటే ప్రమాదం ఉంది.
ఈశాన్య బిహార్ నుంచి జార్ఖండ్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టం నుంచి 0.9 కి.మీ ఎత్తులో గాలి విచ్చిత్తి ప్రభావంతో వచ్చే వారం రోజులు వాతావరణం పూర్తిగా పొడిగా ఉంటుందని ఐఎండీ వెల్లడించింది.

