టార్గెట్ జూన్ 2.. పల్లెలు, పట్నాల్లో ప్రగతి పరుగు...కొత్త ప్రజాప్రతినిధులకు తొలి ‘టాస్క్’.. 100 రోజుల డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ ప్లాన్

టార్గెట్ జూన్ 2.. పల్లెలు, పట్నాల్లో ప్రగతి పరుగు...కొత్త ప్రజాప్రతినిధులకు తొలి ‘టాస్క్’.. 100 రోజుల డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ ప్లాన్
  •     మార్చి 2 లేదా 3 నుంచి జూన్ 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్
  •     తాగునీరు, పారిశుధ్యం, రోడ్ల మరమ్మతులు, మౌలిక వసతులే ప్రధాన ఎజెండా
  •     వార్డులు, డివిజన్లవారీగా అవసరాల గుర్తింపు..  ప్రపోజల్స్ రెడీ చేసుకోవాలని ఆదేశాలు 

హైదరాబాద్, వెలుగు: పల్లెల నుంచి పట్టణాల దాకా సరికొత్త అభివృద్ధికి బాటలు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం100 రోజుల డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ ప్లాన్‌‌‌‌‌‌‌‌ను సిద్ధం చేసింది. వచ్చే నెల 2 లేదా 3వ తేదీ నుంచి ప్రారంభమై జూన్ 2వ తేదీ వరకు ఈ సుదీర్ఘ కార్యాచరణ ప్రణాళిక రాష్ట్రవ్యాప్తంగా నిరంతరాయంగా కొనసాగనున్నది. ప్రధానంగా గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, వైద్య ఆరోగ్య, విద్యా శాఖల సమన్వయంతో ఈ  కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేయనున్నారు. 

ఇటీవల స్థానిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పాలనను పరుగులెత్తించేందుకు కొత్త సర్పంచులు, చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్లు, కార్పొరేటర్లు, వార్డు మెంబర్లకు సర్కారు ఈ ప్రత్యేక టాస్క్ అప్పగించింది. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై  ప్రజాప్రతినిధులకు స్పష్టమైన అవగాహన కల్పించి, బాధ్యతాయుతమైన విధులు నిర్వర్తించేలా ఈ యాక్షన్ ప్లాన్ ఉపకరిస్తుందని ప్రభుత్వం భావిస్తున్నది.  ఇందులో భాగంగా ప్రతి వార్డు, డివిజన్లవారీగా స్థానికంగా ఉన్న అవసరాలను గుర్తించి, పక్కాగా జాబితాను రెడీ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. 

గుర్తించిన పనులకు సంబంధించి నిధులను అంచనా వేసి, వెంటనే ఉన్నతాధికారులకు ప్రపోజల్స్ సిద్ధం చేసి పంపాల్సిన బాధ్యతను స్థానిక యంత్రాంగంపై ఉంచనున్నారు. పల్లెలు , పట్టణాలకు కలిపి రూ. 3 వేల కోట్ల నుంచి రూ. 5 వేల కోట్లు దాకా ఖర్చు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో ముమ్మరంగా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడంతోపాటు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు యుద్ధప్రాతిపదికన శ్రీకారం చుట్టనున్నారు. రాబోయే వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టడం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనే ప్రధాన ఎజెండాగా ఈ ప్రణాళిక రూపుదిద్దుకుంటున్నది.  

ప్రజల వద్దకే యంత్రాంగం.. నిధులకు నో టెన్షన్

క్షేత్రస్థాయిలో ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చడంలో వివిధ విభాగాల మధ్య సమన్వయం అత్యంత కీలకమని భావించిన ఉన్నతాధికారులు ఆ దిశగా ప్రత్యేక వ్యూహరచన చేశారు. అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండేందుకు ఈ యాక్షన్ ప్లాన్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసేలా ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నది. ఆయా డిపార్టుమెంట్లవారీగా ప్రత్యేకమైన బ్లూప్రింట్‌‌‌‌‌‌‌‌ను అందించి, వారు పంపిన ప్రతిపాదనల ఆధారంగా రోజువారీ ప్రగతిని సమీక్షించేలా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. 

విద్యా, ఆరోగ్య రంగాల్లో మౌలిక మార్పులు తెచ్చేందుకు ఈ 3 నెలల గడువును ఒక సవాల్‌‌‌‌‌‌‌‌గా తీసుకోవాలని శాఖాపరంగా మార్గదర్శకాలు ఇవ్వనున్నారు.  గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక స్పష్టమైన టైమ్‌‌‌‌‌‌‌‌లైన్ పెట్టుకొని, నిధుల అంచనాతో సహా పనిచేయడం వల్ల పాలనలో జవాబుదారీతనం మరింత పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల దైనందిన జీవితానికి అత్యంత అవసరమైన డ్రైనేజీల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటులాంటి కనీస వసతుల కల్పనకే ఈ ప్రణాళికలో సింహభాగం ప్రాధాన్యత దక్కింది. 

ప్రతి శాఖకు కేటాయించిన పనులను ఆయా విభాగాల కార్యదర్శులు స్వయంగా పర్యవేక్షించేలా ప్రత్యేక టాస్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్ టీమ్‌‌‌‌‌‌‌‌లను సైతం రంగంలోకి దించుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితిని తప్పించి, పాలనా యంత్రాంగమే నేరుగా ప్రజల వద్దకు వెళ్లేలా ఈ ప్రణాళికను పకడ్బందీగా తీర్చిదిద్దారు. నిరుపేదలకు మెరుగైన వైద్యం, విద్యార్థులకు నాణ్యమైన చదువు అందించే దిశగా ఆస్పత్రులు, బడుల్లో వసతుల మెరుగుదల కోసం వచ్చే నిధులను సద్వినియోగం చేసుకోనున్నారు. 

కొత్త లీడర్‌‌‌‌‌‌‌‌షిప్.. వేసవి కష్టాలకు చెక్ 

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ పదవీకాలం ప్రారంభంలోనే ఈ అభివృద్ధి పనుల్లో పాలుపంచుకోవడం వారికి ఒక ప్రాక్టికల్ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌లా, నాయకత్వ లక్షణాలను పెంచుకునేలా ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. పారిశుధ్య లోపం వల్ల విషజ్వరాలు ప్రబలకుండా ప్రత్యేక డ్రైవ్‌‌‌‌‌‌‌‌లు నిర్వహించి, గ్రామాలు, పట్టణాల్లో పేరుకుపోయిన చెత్తను పూర్తిస్థాయిలో తొలగించేలా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారిన అంతర్గత రహదారులను తక్షణమే గుర్తించి, సిద్ధం చేసిన ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌కు ఆమోదం రాగానే మరమ్మతుల పనులు వేగవంతం చేయనున్నారు. 

ప్రతి ఏటా ఎండాకాలంలో తలెత్తే నీటి సమస్యకు శాశ్వత చెక్ పెట్టేలా రక్షిత మంచినీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ, కొత్త పైపులైన్ల ఏర్పాటుపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. మూలనపడ్డ బోర్ల మరమ్మతులు, పైప్‌‌‌‌‌‌‌‌లైన్ల లీకేజీలను అరికట్టడంలాంటి పనులను ప్రత్యేక నిధులతో రాబోయే కొద్దిరోజుల్లోనే పూర్తి చేయాలని,  పల్లెలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాల లేమి అనేది లేకుండా పారదర్శకంగా పనులన్నీ పూర్తి చేసి, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీ నాటికి సరికొత్త ప్రగతి కానుకగా ప్రజలకు అందించాలన్నది ప్రభుత్వ ప్రధాన వ్యూహంగా కనిపిస్తున్నది.