హైదరాబాద్, వెలుగు: తెలంగాణ శాసన మండలి (లెజిస్లేటివ్ కౌన్సిల్) కోసం అసెంబ్లీ భవనాన్ని ఆనుకుని ఉన్న హెరిటేజ్ భవనంలో పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రూ. 20 కోట్లతో 80 మంది సభ్యులు కూర్చునేలా ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన ఈ బిల్డింగును మార్చి 8న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభించనున్నారు. ఇది హెరిటేజ్ భవనం కావడంతో గతంలో ఉన్న నిర్మాణ శైలి దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుని కౌన్సిల్ హాల్‌గా మార్చారు.
మార్చి 16 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలు ఈ కొత్త భవనంలోనే జరగనున్నాయి. అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలు పక్కపక్కనే ఉండటంతో రానున్న రోజుల్లో రెండు సభల సభ్యులు ఒకే చోట కలిసి చర్చించేందుకు పార్లమెంట్ తరహాలో సెంట్రల్ హాల్ నిర్మించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. బడ్జెట్ సమావేశాలు ముగిశాక సెంట్రల్ హాల్ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. పెండింగ్‌లో ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గురువారం ఆదేశించారు.
