V6 News

లైఫ్సైన్సెస్లో దూసుకుపోతున్నం ..మరో 20 ఏండ్లలో 25 రెట్ల అభివృద్ధి జరుగుతుంది..క్లీనర్, గ్రీనర్, సేఫర్ కాన్సెప్ట్తో ముందుకెళ్లాలి

లైఫ్సైన్సెస్లో దూసుకుపోతున్నం ..మరో 20 ఏండ్లలో 25 రెట్ల అభివృద్ధి జరుగుతుంది..క్లీనర్, గ్రీనర్, సేఫర్ కాన్సెప్ట్తో ముందుకెళ్లాలి
  • వ్యాక్సిన్ల తయారీ సంస్థలు ఇంకా రావాలి
  • ఇన్నొవేషన్​, మాన్యుఫ్యాక్చరింగ్ సమాంతరంగా వృద్ధి చెందాలి
  • ‘జీనోమ్ వ్యాలీ అండ్ బియాండ్’ అంశంపై ప్యానెల్ డిస్కషన్​లో నిపుణులు 

హైదరాబాద్, వెలుగు:  లైఫ్​సైన్సెస్ రంగంలో తెలంగాణ దూసుకుపోతున్నదని ఇండస్ట్రీ నిపుణులు చెప్పారు. మరో 20 ఏండ్లలో తెలంగాణ జీనోమ్ వ్యాలీ ఇప్పుడున్న డెవలప్​మెంట్​కు 25 రెట్లు అభివృద్ధి చెందుతుందన్నారు. అందుకు అవసరమైన మౌలిక వసతులన్నీ రాష్ట్రంలో ఉన్నాయన్నారు. క్లీనర్, గ్రీనర్, సేఫర్ కాన్సెప్ట్ తో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

 మంగళవారం తెలంగాణ రైజింగ్–గ్లోబల్ సమిట్ రెండో రోజు సమావేశాల్లో ‘జీనోమ్ వ్యాలీ అండ్​ బియాండ్: యాక్సిలరేటింగ్ ఇన్నొవేషన్ ఇన్ లైఫ్​సైన్సెస్’ అంశంపై ప్యానెల్ డిస్కషన్​ నిర్వహించారు. ఇందులో ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, లారస్ చైర్మన్, సీఈవో సత్యనారాయణ చావా, అరబిందో డైరెక్టర్​ మదన్ మోహన్ రెడ్డి, గ్రాన్యూల్స్ ఇండియా ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్ ప్రియాంక చిగురుపాటి, ఐఐఎల్ ఎండీ డాక్టర్ అనంత్ కుమార్, రెడ్డీస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైఫ్​సైన్సెస్ డైరెక్టర్ శ్రీనివాస్ ఓరుగంటి పాల్గొన్నారు.

 లైఫ్​సైన్సెస్​ రంగంలో తెలంగాణ ఏడో ర్యాంక్​లో ఉందని రెడ్డీస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైఫ్​సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ ఓరుగంటి శ్రీనివాస్ అన్నారు. ప్రపంచంలో 30 శాతం వ్యాక్సిన్లు ఇక్కడి నుంచే ఎగుమతి అవుతున్నాయన్నారు. 

  రూ.63 వేల కోట్ల పెట్టుబడులు: శ్రీధర్ బాబు 

ప్రభుత్వం అమలు చేస్తున్న పరిశ్రమల అనుకూల విధానాలతో రెండేండ్లలో ఒక్క లైఫ్‌ సైన్సెస్ రంగంలోనే రూ.63 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని  మంత్రి శ్రీధర్‌‌బాబు తెలిపారు. తెలంగాణ గ్లోబల్ వ్యాక్సిన్స్ కేంద్రంగా అవతరించిందన్నారు. కరోనా సమయంలో ప్రపంచం మొత్తానికి అండగా నిలిచామన్నారు. వంద బిలియన్ డాలర్ల విలువైన 2వేల ఫార్మా కంపెనీలు రాష్ట్రంలో ఉన్నాయని, ప్రపంచంలో పది పెద్ద ఫార్మా కంపెనీల్లో 8 తెలంగాణలోనే ఉన్నాయని చెప్పారు. గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను, విధానాలను కొనసాగిస్తూ పారిశ్రామిక రంగానికి ఏ ఆటంకాలు లేకుండా చూస్తున్నామని వివరించారు. అంతర్జాతీయ స్థాయి లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. 

  హెచ్ఐవీ మందులు ఇక్కడినుంచే: సత్యనారాయణ చావా

దేశంలో సర్వీస్ బేస్డ్ ఎకానమీ కాదని.. ఇన్నొవేషన్, మాన్యుఫ్యాక్చరింగ్​ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని లారస్ చైర్మన్, సీఈవో సత్యనారాయణ చావా అన్నారు. ఆ రెండు రంగాలు అభివృద్ధి చెందితేనే ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగవుతుందని చెప్పారు. అందుకు ఎక్సలెన్స్ సెంటర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. 75 శాతం హెచ్ఐవీ మందులను ప్రపంచానికి తెలంగాణ సరఫరా చేస్తున్నదన్నారు. దాని వల్ల హెచ్ఐవీ మందుల ఖర్చు తగ్గిందన్నారు.  

వృథా తగ్గించాలి: మదన్ మోహన్ రెడ్డి 

ఇంజెక్టబుల్స్, కాంప్లెక్స్ మాలిక్యూల్స్, పెప్టైడ్స్ వంటి వాటి తయారీకి పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుందని, అందుకు సరైన ఎకోసిస్టమ్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందని అరబిందో డైరెక్టర్ మదన్ మోహన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో దానికి సంబంధించి మౌలిక వసతులున్నాయని, జీనోమ్ వ్యాలీనే అందుకు ఉదాహరణ అని చెప్పారు. ఔషధాల తయారీలో వృథాను తగ్గించేలా కొత్త మార్గాలను ఎంచుకుంటున్నామని, ఏఐ టెక్నాలజీలనూ వాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 

బేసిక్ ఎసెన్షియల్స్​పై దృష్టి పెట్టాలి: ప్రియాంక  

సంస్థలు బేసిక్ ఎసెన్షియల్స్​పై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని గ్రాన్యూల్స్ ఇండియా ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ ప్రియాంక చిగురుపాటి అన్నారు. చాలా వరకు బల్క్​ డ్రగ్స్​ను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, ఇక్కడే తయారు చేసుకునేలా ఇన్​ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయాలన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఆ దిశగా అడుగులు పడుతున్నాయని, అందుకు గర్వంగా ఉందని చెప్పారు.  

సంస్థలు పెరగాలి: అనంత్ కుమార్​

ప్రజలకు వ్యాక్సిన్లను అందుబాటు ధరల్లో అందించడం చాలా ముఖ్యమని ఐఐఎల్ ఎండీ డాక్టర్ అనంత్ కుమార్ అన్నారు. దేశంలో వేలాది ఫార్మా సంస్థలున్నా.. వ్యాక్సిన్ తయారీ సంస్థలు 8 మాత్రమే ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లపై దృష్టిపెట్టాలని, భవిష్యత్​లో తయారీ ఖర్చు తగ్గుతుందని చెప్పారు. చాలా దేశాల్లో వైరస్ రూపాలు వేరుగా ఉంటున్నాయని, కాబట్టి దేశానికి తగినట్టుగా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు.  

ఫ్యూచర్ సిటీతో 13 లక్షల ఉద్యోగాలు జీరో కార్బన్ సిటీగా డెవలప్ చేస్తున్నం: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్ వెలుగు: రాష్ట్ర రూపురేఖలు మార్చేలా 13,500 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి జీరో కార్బన్ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. మంగళవారం గ్లోబల్ సమిట్‌‌‌‌‌‌‌‌లో ఫ్యూచర్ సిటీపై ప్యానల్ డిస్కషన్ లో ప్రభుత్వ ప్రణాళికలను ఆయన వివరించారు. ఈ మెగా సిటీ ద్వారా 13 లక్షల మందికి ఉపాధి కల్పించడంతో పాటు 9 లక్షల మందికి నివాసం కల్పిస్తామన్నారు.

 ఈ నగరాన్ని ఏఐ, హెల్త్, ఎంటర్టైన్‌‌‌‌‌‌‌‌మెంట్, స్పోర్ట్స్, డేటా సెంటర్స్, ఎడ్యుకేషన్ హబ్‌‌‌‌‌‌‌‌ లుగా మొత్తం ఆరు అర్బన్ జిల్లాలుగా విభజించి, అంతర్జాతీయ ఆర్కిటెక్చర్, రవాణా వ్యవస్థతో దేశ విదేశీ పెట్టుబడులకు అయస్కాంతంలా మారుస్తామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి విజన్‌‌‌‌‌‌‌‌ కు తగ్గట్టుగా ఇది మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి దోహదపడుతుందని తెలిపారు. 

అలాగే, ఫ్యూచర్ సిటీలో పచ్చదనం, నీటి సంరక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తూ.. ప్రతి వర్షపు చుక్క ఇంకేలా రెయిన్ హార్వెస్టింగ్, అర్బన్ ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌లను ఏర్పాటు చేస్తామని, వన్యప్రాణుల కోసం రిలయన్స్ ఫౌండేషన్ వంతారాతో ఒప్పందం కుదుర్చుకున్నామని మంత్రి తెలిపారు. మరో నెల రోజుల్లో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభం కానుండగా.. డేటా సెంటర్ల కోసం కేటాయించిన 400 ఎకరాల్లో ఫిబ్రవరి నాటికి నిర్మాణాలు మొదలవుతాయన్నారు.