టీచర్ల విదేశీ ప్రయాణాలకు ఆన్‌ లైన్ ఎన్‌వోసీ

టీచర్ల విదేశీ ప్రయాణాలకు ఆన్‌ లైన్ ఎన్‌వోసీ
  • ఇకపై మాన్యువల్ ఫైళ్లకు చెక్.. అంతా డిజిటల్ మయం
  • ఉత్తర్వులు జారీ చేసిన నవీన్ నికోలస్ 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లు, ఇతర సిబ్బంది విదేశీ ప్రయాణాలకు సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాలకు వెళ్లాలనుకునే టీచర్లు, బోధనేతర సిబ్బంది ఇకపై తప్పనిసరిగా ఆన్‌లైన్‌లోనే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్‌వోసీ) పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీచేశారు.  

కాగా, గతంలో విదేశీ పర్యటనల అనుమతుల కోసం ఫైళ్లు ఒక టేబుల్ నుంచి మరో టేబుల్ కు కదలడానికి నెలల టైమ్ పట్టేది. ఈ జాప్యాన్ని నివారించి, పారదర్శకత పెంచేందుకు టీచర్స్ ఆన్‌లైన్ ఎన్‌వోసీ మాడ్యూల్ అందుబాటులోకి తీసుకొచ్చారు.  అన్ని కేడర్ల ఉద్యోగుల విదేశీ పర్యటనల దరఖాస్తులను కేవలం ఆన్‌లైన్ ద్వారానే ప్రాసెస్ చేయాలని ఆర్జేడీ, డీఈఓలకు ఆదేశాలు ఇచ్చారు. 

పర్యవేక్షించే వారి డేటా సేకరణ..

ఆన్‌లైన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. జిల్లాల్లో ఎన్‌వోసీ సెక్షన్‌ను పర్యవేక్షిస్తున్న కార్యాలయ సిబ్బంది వివరాలను ఈ నెల 29 వరకూ పంపాలని డైరెక్టర్ నవీన్  నికోలస్ ఆదేశించారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక ప్రొఫార్మాను విడుదల చేశారు. అందులో సిబ్బంది పేరు, హోదా, ఫోన్ నంబర్లను పొందుపరిచి పంపాల్సి ఉంటుంది.