రవాణా వాహనాల పై రిఫ్లెక్టివ్ టేపులు : రవాణా శాఖ

రవాణా వాహనాల పై రిఫ్లెక్టివ్ టేపులు :  రవాణా శాఖ
  • ఐదు సంస్థలకు లైసెన్స్ ఇచ్చిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి సమయాల్లో రవాణా వాహనాలు స్పష్టంగా కనిపించేలా ‘రిఫ్లెక్టివ్ టేపులు’, ‘రియర్ మార్కింగ్ ప్లేట్ల’ను ఏర్పాటు చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ కొత్త విధానం ఫిబ్రవరి 20వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి రానుంది. వాహనాలకు అమర్చే రిఫ్లెక్టివ్ టేపులపై తెలంగాణ రవాణా శాఖ లోగోతో కూడిన హోలోగ్రామ్, ప్రత్యేక సీరియల్ నంబర్, క్యూఆర్ కోడ్ ఉంటాయి. క్యూఆర్ ఆధారిత మేనేజ్‌‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఐఎస్) ద్వారా అధికారులు వీటిని ధ్రువీకరిస్తారు. 

ఈ టేపులు, ప్లేట్లను అమర్చేందుకు ఐదు కంపెనీలకు 2027, ఫిబ్రవరి 8వ తేదీ వరకు రవాణా శాఖ లైసెన్స్ ఇచ్చింది. వీటిలో  ఓరాఫోల్ ఇండియా పీవీటీ లిమిటెడ్, త్రిఎం ఇండియా లిమిటెడ్, గ్లోడియన్ రిఫ్లెక్టివ్ పీవీటీ లిమిటెడ్, డోమింగ్ రిఫ్లెక్టివ్ మెటీరియల్ ఇండియా పీవీటీ లిమిటెడ్, అవేరీ డెన్నిసన్ ఇండియా పీవీటీ లిమిటెడ్ ఉన్నాయి. వా హన యజమానులు కేవలం ప్రభుత్వం ఎంపానెల్ చేసిన సంస్థల అధీకృత డీలర్లు లేదా అప్లికేటర్ల వద్ద మాత్రమే ఈ టేపులను అమర్చుకోవాలి.