- ఆవిర్భావ సంబురాలకు రాష్ట్రం ముస్తాబు
- నేడు 12 ఏండ్ల తెలంగాణ అవతరణ పండుగ.. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు
- పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్న సీఎం రేవంత్
- జిల్లాల్లో ఇన్‌చార్జి మంత్రులు, విప్‌ల చేతులమీదుగా పతాకావిష్కరణ
- ఆవిర్భావం వేళ ఇందిరమ్మ ఇండ్లు.. చేయూత పెన్షన్లు.. ఉద్యోగాల జాతర
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి రాష్ట్రం ముస్తాబైంది. రాష్ట్రం ఏర్పడి 12 ఏండ్లు పూర్తిచేసుకుంటున్న తరుణంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అవతరణ సంబురాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఉదయం 8.30 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి, రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకుంటూ గన్‌పార్క్ వద్ద నివాళులర్పించిన అనంతరం సీఎం పరేడ్ గ్రౌండ్ వేడుకల్లో పాల్గొంటారు. హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాల్లోనూ ఆయా జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, ప్రజాప్రతినిధులు అధికారికంగా జాతీయ జెండాలను ఆవిష్కరించి, పండుగ వాతావరణంలో సంబురాలను ఘనంగా నిర్వహించనున్నారు. జూన్ 2 సందర్భంగా పలు పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.
పేదవాడి సొంతింటి కల నిజం చేసే దిశగా ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇండ్ల పథకం రెండో విడతను ప్రారంభించింది. దీంతోపాటు నిరుపేద వృద్ధులు, వితంతువులకు అండగా నిలిచేందుకు కొత్తగా మరో 2 లక్షల మంది అర్హులకు ‘చేయూత’ పెన్షన్లను మంజూరు చేస్తూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. అలాగే, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 12 వరకు ప్రత్యేక గ్రామ సభల నిర్వహణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని కోటికి పైగా కుటుంబాల సామాజిక భద్రత కోసం ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ అమలుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇదే వేదికపై నుంచి వెలువడనుండటం విశేషం. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య నిర్మూలనకు కట్టుబడి ఉన్నామని చాటిచెబుతూ, తెలంగాణ యువత ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లను ప్రభుత్వం ఈ శుభ సందర్భంగా విడుదల చేయనున్నది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తూ వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రకటన చేయనున్నారు. రెండున్నరేండ్ల పాలనలో సాధించిన ప్రగతిని, భవిష్యత్ కార్యాచరణను వివరించేలా రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేశారు. సెక్రటేరియెట్, అసెంబ్లీ, రాజ్‌భవన్‌లాంటి ప్రధాన ప్రభుత్వ భవనాలను విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.
