ఆర్టీసీలో యూనియన్లకు అనుమతించండి.. లేబర్ కమిషనర్​కు టీజేఎంయూ వినతి

ఆర్టీసీలో యూనియన్లకు  అనుమతించండి.. లేబర్ కమిషనర్​కు టీజేఎంయూ వినతి

హైదరాబాద్, వెలుగు : ఆర్టీసీలో యూనియన్ల ఏర్పాటుకు అనుమతించాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ ( టీజేఎంయూ )జనరల్ సెక్రటరీ హనుమంతు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన లేబర్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. హనుమంతు మాట్లాడుతూ..ఆర్టీసీలో యూనియన్లు లేకపోవటంతో  కార్మికులను అధికారులు తీవ్రంగా వేధిస్తున్నారని తెలిపారు. లీవ్ లు ఇవ్వకుండా నిత్యం 12 గంటల పాటు డ్యూటీలు ఇస్తున్నారని, మహిళా కండక్టర్లను రాత్రి 9 తరువాత కూడా డ్యూటీ చేయమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

కార్మిక చట్టాల ప్రకారం అన్ని ప్రభుత్వ కార్పొరేషన్లలో యూనియన్లు ఉంటాయని గుర్తుచేశారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి యూనియన్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని వెల్లడించారు. అందువల్ల ఆర్టీసీలో యూనియన్లను అనుమతించటంతో పాటు ఎన్నికలు నిర్వహించేలా మేనేజ్ మెంట్​కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. బుధవారం విద్యానగర్​లోని యూనియన్ ఆఫీస్​లో టీజేఎంయూ  ఆవిర్భావ దినోత్సవం జరిగింది.