తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి : మంత్రి పొన్నం

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి : మంత్రి పొన్నం
  • అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి: మంత్రి పొన్నం
  • కేంద్రమంత్రి బండి సంజయ్‌ని గ్లోబల్‌ సమ్మిట్‌కు ఆహ్వానించిన మినిస్టర్

కరీంనగర్, వెలుగు: గత పదేండ్లలో తెలంగాణ ఆర్థికంగా వెనకబడిందని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ కోరారు. ఏపీ అభివృద్ధికి ఎక్కువ నిధులు ఇస్తున్న కేంద్రం.. తెలంగాణను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. 

ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి శనివారం కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని కరీంనగర్‌లో కలిసి గ్లోబల్‌ సమిట్‌ ఆహ్వానపత్రాన్ని అందజేశారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్‌ మీడియాతో మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. రైజింగ్‌ 2047 విజన్‌తో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలుపుతామన్నారు. 

సాయి ఈశ్వర్‌ మృతి దురదృష్టకరం

సాయి ఈశ్వర్‌ మృతి దురదృష్టకరమని, ఇలాంటి బలిదానాలు ఎవరూ చేసుకోవద్దని మంత్రి పొన్నం కోరారు. ఈశ్వర్ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కులగణనకు తాము‌ కట్టుబడి ‌ఉన్నామని.. 50 శాతం రిజర్వేషన్‌ దాటరాదన్న కృష్ణమూర్తి కేసును కూడా సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తామని వెల్లడించారు. ఎవరు ప్రేరేపించినా బీసీ బిడ్డలు బలిపశువులు కావొద్దని విజ్ఞప్తి చేశారు.

తప్పని పరిస్థితుల్లోనే జీపీ ఎన్నికలకు.. 

తప్పనిసరి పరిస్థితుల్లోనే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నామని, ఈ ఎన్నికలు నిర్వహించడం అంటే రిజర్వేషన్లకు వ్యతిరేకమని కాదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. అందరం కలిసి బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంతో కొట్లాడుదామని పిలుపునిచ్చారు.