ఆ ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణ లో విలీనం చేయండి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఆ ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణ లో విలీనం చేయండి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  •     ఏపీ సీఎం చంద్రబాబుకు మంత్రి తుమ్మల విజ్ఞప్తి
  •     సాగునీటి ప్రాజెక్టులు, దేవస్థానాల అభివృద్ధి తదితర కీలక అంశాలపై చర్చ
  •     తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయం పెంపొందించాలని సూచన

హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు సాగితే అభివృద్ధి సాధ్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. సోమవారం అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం తలెత్తిన పరిపాలనా సమస్యలు, సాగునీటి ప్రాజెక్టులు, దేవస్థానాల అభివృద్ధి, రైల్వే లైన్ల నిర్మాణం వంటి విస్తృత అంశాలపై ఆయన చంద్రబాబుతో చర్చించారు. తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయం పెంపొందించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. 

ఈ భేటీలో ప్రధానంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సంబంధించిన పలు కీలక సమస్యలను చంద్రబాబు దృష్టికి తుమ్మల తీసుకెళ్లారు. రాష్ట్ర విభజన సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండలానికి అనుకుని ఉన్న యెటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామపంచాయతీలు ఏపీలో కలిసిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. భౌగోళికంగా తెలంగాణ ప్రాంతాల మధ్య ఉన్న ఈ గ్రామాల గిరిజన ప్రజలు పరిపాలనా, భద్రత, పన్నుల సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. 

జిల్లా కేంద్రాలకు చేరుకోవడానికి 8 గంటలు ప్రయాణించాల్సి వస్తోందని, గోదావరి నది, అటవీ ప్రాంతాల మధ్య ఉన్న ఈ ప్రాంతాలను తిరిగి తెలంగాణలో విలీనం చేస్తే పరిపాలనా సౌలభ్యం, గిరిజన అభివృద్ధి సాధ్యమవుతాయని కోరారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం పరిపాలనలో ఈ గ్రామాలు కీలకమని అభిప్రాయపడ్డారు. అలాగే, పెద్దవాగు సాగునీటి ప్రాజెక్ట్ శాశ్వత మరమ్మతుల అంశాన్ని చంద్రబాబు దృష్టికి  మంత్రి తుమ్మల తీసుకెళ్లారు. ఖమ్మం జిల్లాలోని ఈ ప్రాజెక్ట్ ద్వారా 16 వేల ఎకరాలకు సాగునీరు అందుతోందని.. అందులో 85.25% (13,640 ఎకరాలు) ఏపీలో, 14.75% (2,360 ఎకరాలు) తెలంగాణలో ఉన్నాయని తెలిపారు. 

పునరుద్ధరణకు రూ.92.20 కోట్లు అవసరమని.. రెండు రాష్ట్రాలకు లబ్ధిచేకూరుతున్న నేపథ్యంలో 85:15 నిష్పత్తిలో నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్ట్‌‌పైనే తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. భద్రాచలం వరద రక్షణ కరకట్టలో 3వ స్లూయిస్ వద్ద గోడ దెబ్బతిన్న అంశాన్ని  తుమ్మల ప్రస్తావించారు. ఏపీ పరిధిలో ఉన్న ఈ కరకట్టలో ఏర్పడిన నష్టం భద్రాచలం పట్టణానికి ప్రమాదం కల్పించవచ్చని హెచ్చరించారు.  సాంకేతిక పరిశీలన చేసి తాత్కాలిక రక్షణ చర్యలు చేపట్టి, శాశ్వత పునరుద్ధరణ చేపట్టాలని కోరారు.

టీటీడీ దేవాలయ నిర్మాణానికి సహకరించాలి..

ఖమ్మం పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి భూమి గుర్తింపు పూర్తయిందని, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో పనులు ప్రారంభించేందుకు సహకరించాలని తుమ్మల.. చంద్రబాబును కోరారు. అలాగే, తిరుమలలో తెలంగాణ భక్తుల కోసం ప్రత్యేక యాత్రికుల భవనం నిర్మాణానికి 5 ఎకరాల స్థలం కేటాయించాలని ప్రతిపాదించారు. 

సత్తుపల్లి–కొవ్వూరు, పెనుబల్లి–అమరావతి రైల్వే లైన్ల నిర్మాణానికి కృషి చేయాలని మంత్రి కోరారు. ఈ లైన్లు అమలులోకి వస్తే వాణిజ్య, వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేస్తాయని తెలిపారు. ఈ ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకుంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు.