- అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: వచ్చే వానాకాలం సీజన్‌లో మార్కెట్లో డిమాండ్ ఉన్న సన్నరకం వరి విత్తనాలను అందుబాటులోకి తేవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. శుక్రవారం సెక్రటేరియట్ లో సన్నరకం వరి విత్తనాల ఎంపిక, విత్తనాల లభ్యత, సాగు ప్రణాళికలపై సమీక్ష నిర్వహించారు. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు, అగ్రికల్చర్ వర్సిటీ శాస్త్రవేత్తలు, అధికారులతో చర్చించారు.
వచ్చే వానాకాలం సీజన్‌కు సంబంధించి బీపీటీ-5024, ఆర్ఎన్ఆర్ -15048, హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్ఎం-1638, డబ్ల్యూజీఎల్ -44, డబ్ల్యూజీఎల్ --962, జేజీఎల్-1798 తదితర సన్నరకం విత్తనాలను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మే 15 నాటికి వరి విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. మే 4 నుంచి 9 వరకు నిర్వహించే రైతు ఉత్సవాల్లో ఈ విత్తనాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. సీడ్ కార్పొరేషన్‌తోపాటు ప్రైవేట్ సంస్థలు ఇదే రకమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని సూచించారు.
ప్రతి పంటను కేంద్రమే కొనుగోలు చేయాలి..
కనీస మద్దతు ధర ప్రకటించడం వరకే కేంద్రం పరిమితమైందని, కొనుగోలు బాధ్యతను మరిచిందని మంత్రి తుమ్మల అన్నారు. దీనివల్ల ఏటా రాష్ట్రంపై రూ.3 వేల కోట్ల వరకు అదనపు భారం పడుతోందని తెలిపారు. ఎంఎస్ పీ ప్రకటించిన ప్రతి పంటను కేంద్రమే పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అగ్రికల్చర్ సెక్రటరీ సురేంద్ర మోహన్, శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు.

